తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ సాదినేని విరుచుకుపడ్డారు. మేడిన్ జపాన్, మేడిన్ జర్మన్ తరహాలో త్వరలోనే మేడిన్ ఏపీ నినాదం రాబోతుందని యామినీ చెప్పారు. అనంతపురం జిల్లాలో స్థాపించిన కియా మోటార్స్ నుంచి తొలి కారు వెలువడ్డాక యామినీ శర్మ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రావాళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కియా కారు విడుదల సందర్భంగా చెప్పారు. యామినీ శర్మ పవన్ కళ్యాణ్‌పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ… ఓ నాయకుడు అమరావతిని స్వాధీనం చేసుకుంటామని అంటున్నారని, సహజ వనరులు కొల్లగొడుతున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
మోదీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని బీజేపీ నేతలను కూడా యామినీ శర్మ ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మాట్లాడుతూ… గోడలకు కన్నాలు, సున్నాలు వేసుకునే నేతలు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.