ఏపీలో భారీగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణల కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ తెరదీసింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజక వర్గం సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహావిష్కరణతో ఇది మొదలైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 100 విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన. సత్తెనపల్లిలో విగ్రహాన్ని ఆవిష్కరించి ఫొటోదిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో పోరాడాలని తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
అంతవరకు బాగానే ఉంది కానీ దేని గురించి పోరాడాలనే విషయంలోనే స్పష్టత లేదు. రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని బీజేపీ మీద పోరాడాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇస్తున్నారు. మరి మొన్నటి వరకు రాష్ట్ర ప్రజలను పాలించి, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నిట్టనిలువునా రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌ను ఏం చేయాలి? అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కానీ, ఒక వేళ వస్తే, మీ తలనొప్పికి ఉపశమనంగా ప్రత్యేక హోదా రూపంలో జండూ బామ్ రాస్తామని చెప్పిన కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వాలా? అలాంటి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న తెలుగుదేశానికి రాష్ట్రంలో మద్దతు ఇవ్వాలా?
ఈ రెండిటిలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఏది? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కొద్ది ఏళ్లు మినహాయిస్తే కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. మరి ఎన్టీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడలేదా? బీజేపీ కచ్చితంగా ఏపీ పట్ల పక్షపాతం చూపిస్తుంది. అలాగని కాంగ్రెస్‌తో జతకట్టడం ఎన్టీఆర్ స్ఫూర్తి ఎలా అవుతుందో మరి. దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
ఏపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఎంతోకొంత బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలేవీ కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లడం లేదు. మరి ఏకంగా రాష్ట్రాన్ని చీల్చి సమస్యల్లోకి నెట్టిన కాంగ్రెస్‌తో జతకట్టడానికి చంద్రబాబు నాయుడుకు వచ్చిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. బీజేపీ విమర్శిస్తున్నట్టు ఇందులో వారి రాజకీయ ప్రయోజనాలతోపాటు వేరే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఎన్నికల తర్వాత గానీ తేలదు.