రాష్ట్ర విభజనతో ఏపీలో వేర్లతో సహా కూలిపోయిన మహా వృక్షంలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. గత ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి, ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది కాంగ్రెస్. ఓట్ల శాతం 1 శాతానికి పరిమితమై పోయింది. ఇంత దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ను మళ్లీ పునర్ నిర్మించాలన్న ధ్యాస, ఆశ కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాలను కూడా రాహుల్ గాంధీ గాలికొదిలేసినట్టు కనిపిస్తుంది.
తెలుగుదేశంతో పొత్తువల్ల ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంతోకొంత విమర్శిస్తూ ఎదగాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు టీడీపీతో పొత్తు మరింత ఇబ్బందిగా తయారైంది. తెలంగాణలో పొత్తు బెడిసికొట్టడంతో చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుకు వెనక్కుతగ్గారు. అయితే జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారైంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక్కొక్కరే పార్టీని వదలిపోతున్నారు. టీడీపీ, బీజేపీ లేదా వైసీపీలో చేరడానికి మొగ్గుచూపుతున్నారు. కావూరి సాంబశివరావు బీజేపీలో ఎప్పుడో చేరారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు, ఏపార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.
రాహుల్ గాంధీ కూడా ఏపీలో కాంగ్రెస్‌ను నిలబెడదామన్న ఆలోచనతో ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా చంద్రబాబుకే వదిలేసినట్టు కనిపిస్తుంది. మీకు ఎలా ప్రయోజనం అనుకుంటే అలా చేయండని గతంలో చంద్రబాబుతో రాహుల్ గాంధీ అన్నట్టు వార్తలొచ్చాయి. అంటే మరో అయిదేళ్లు కాంగ్రెస్ నాయకులు అలాగే కాలం వెళ్లబుచ్చాల్సిందే.