ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా ప్రజాభిమానం చూరగొనాలని బీజేపీ ఆపసోపాలు పడుతుంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిని ఏపీ ప్రజలు బాగా నిరసిస్తుండటంతో, ఆ వ్యతిరేకతను పోగొట్టడానికి రైల్వే జోన్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు.
రైల్వే జోన్ విషయంలో కూడా బీజేపీని దురదృష్టం వెంటాడింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, సభకు రెండ్రోజులు ముందుగా రైల్వే జోన్ ప్రకటించి ప్రజల మద్దతు కూడగట్టాలని ప్రయత్నించింది. ఈ హడావిడిలో, ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం కాస్తా బ్యాక్‌ఫైర్ అయినట్టు కనిపిస్తుంది. వాల్తేరు డివిజన్‌ను విడదీసి, రద్దుచేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి రాజకీయంగా లాభం కంటే నష్టాన్నే బీజేపీ మూటకట్టుకుంది.
వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం, గతంలో ఈ డివిజన్‌లో ఉన్న చాలా ప్రాంతాలను ఒడిషాలోని రాయగడ్ డివిజన్‌లో కలపడం ద్వారా బీజేపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందనే చెప్పాలి. దీనివల్ల వాల్తేరు డివిజన్‌లో పనిచేస్తున్న వేల మంది తెలుగు ఉద్యోగులకు స్థానభ్రంశం కలిగే అవకాశం ఉంది. ఇది వారికి నష్టం కలిగించే అంశమే.
కొత్త రైల్వే జోన్ వల్ల కార్గో ఆదాయం అంతా ఒడిషాకు పోతుందని ఏపీ ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. రైల్వే ఆదాయం, నష్టాలతో రాష్ట్రాలకు పనిలేదని బీజేపీ వాదిస్తోంది. కానీ లాభం వచ్చే రైల్వే జోన్ పట్ల కేంద్రం కేటాయింపుల్లో పక్షపాతం చూపించే అవకాశం ఉంటుంది. మరిన్ని కొత్త లైన్‌లు, ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా భవిష్యత్తులో ముందుకురావచ్చు. కానీ నష్టం వచ్చే జోన్‌లో కేంద్రం కొత్త ప్రాజెక్టులు, రైల్వే లైన్లకు మొగ్గు చూపకపోవచ్చు. అందువల్ల లాభనష్టాలకు అతీతంగా రైల్వేజోన్ను చూడలేము. మొత్తం మీద రైల్వే జోన్ ప్రకటించి కేంద్రం ఏపీని మరింత అవమానపరచిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంది.