ఏపీలో తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు ఎవ‌రికి లాభం? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువైపు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారబోతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను చూస్తుంటే ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో  మూడు కూట‌ములు క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌టి అంద‌రికీ తెలిసిన వైఎస్ఆర్‌సీపీ – బీజేపీ కూట‌మి, రెండోది తెలుగుదేశం – కాంగ్రెస్ కూట‌మి. ఇక మూడోది జ‌న‌సేన – సీపీఎం కూట‌మి. రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌తో పొత్తు విష‌యంలో తెలుగుదేశం వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా అక్క‌డ పార్టీని ఎంతోకొంత నిలుపుకొనే అవ‌కాశం టీడీపీకి ల‌భించింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ ఏపీలో అమ‌లు చేయ‌నుంది. అక్క‌డ టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా పూర్తిగా చ‌తికిల‌బ‌డిన పార్టీని  మ‌ళ్లీ బ‌తికిం చుకోవాల‌నే ఆశ కాంగ్రెస్‌లో క‌నిపిస్తుంది. అందువ‌ల్ల తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖాయ‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు.

 

TDP – Congress Alliance in Telangana and Andhra Pradesh is likely to benefit both the parties.

టీడీపీ కేంద్రంలోని ఎన్టీఏ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌త్యేక హోదా.  ఇప్ప‌డు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం ప్ర‌త్యేక హోదా ఫైలు మీద‌నే అని చెబుతుంది కాబ‌ట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డానికి తెలుదేశానికి పెద్ద‌గా అభ్యంత‌రాలు ఎదుర‌య్యే అవ‌కాశం కూడా లేదు.  ప్ర‌త్యేక హోదా ద్వారా రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది కాబ‌ట్టి, త‌మ‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ముఖ్యం కాబ‌ట్టి కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్ల‌డానికి టీడీపీ పెద్ద‌గా ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

 

ప్ర‌జ‌ల్లో కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ మీద‌నే ఎక్కువ వ్య‌తిరేకత ఉంది కాబ‌ట్టి  టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఇద్ద‌రికీ ఎంతో కొంత లాభించే అవ‌కాశాలు ఉన్నాయి. జ‌గ‌న్ – బీజేపీ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూట‌మిని ఓడించ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన  ల‌క్ష్యం. దీనికోసం కాంగ్రెస్‌ను చేర‌దీయ‌డం రాజ‌కీయంగా మంచి వ్యూహం కావ‌చ్చు. ఒక‌రకంగా తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు తెలుగుదేశం కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ప్ర‌యోజ‌న‌క‌రం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ఏపీలో డిపాజిట్లు కోల్పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ప‌రిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ మ‌ళ్లీ బత‌కాలంటే అధికార పార్టీ మ‌ద్ద‌తు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

ఎన్నిక‌ల నాటికి మ‌రో కీల‌క ప‌రిణామం జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది కీల‌కం కానుంది. ఒక‌వేళ జ‌న‌సేన పార్టీ జ‌గ‌న్ – బీజేపీ కూట‌మితో క‌లిస్తే సీపీఎం పార్టీ తెలుగుదేశం – కాంగ్రెస్ కూట‌మితో క‌లిసే అవ‌కాశం లేక‌పోలేదు. బీజేపీ ఉన్న కూట‌మిలో సీపీఎం కొన‌సాగ‌డం కుద‌ర‌క‌పోవచ్చు. ఇదే జ‌రిగితే పోటీ రెండు కూట‌ముల మ‌ధ్య‌నే ఉంటుంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల వ్యూహం ఏంట‌నేది తెలియ‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌ట్టొచ్చు.