ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎన్టీఆర్ కుటుంబ రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. తెలుగుదేశంలో అధికార మార్పిడి సందర్భంలో చంద్రబాబు వెంట ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం తదనంతర పరిణామాల్లో టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా జరిగింది. అక్కడ నుంచి కాంగ్రెస్; ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు వైసీపీ.. ఇలా దగ్గుబాటి కుటుంబ రాజకీయ ప్రస్థానం సాగుతోంది. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది ఎన్నికల్లో చూడాల్సిన అంశమే.
దగ్గుబాటి కుటుంబానికి ప్రకాశం జిల్లాలో మంచి పలుకుబడి ఉంది. వెంకటేశ్వరరావు తండ్రి చెంచురామయ్య నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్న వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్‌కు అల్లుడు కావడంతో ఆ పలుకుబడి మరింత పెరిగింది. పర్చూరు, బాపట్ల, అద్దంకి, దర్శి నియోజక వర్గాల్లో దగ్గుబాటి అభిమానులు, అనుచరులు ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల్లో వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి.
2009 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, పురందేశ్వరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పురందేశ్వరి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు లేవు. అయితే పురందేశ్వరి వైసీపీలో చేరితే ప్రజలు ఆదరించరనే అభిప్రాయం దగ్గుబాటి కుటుంబానికి కలిగినట్టు ఉంది. అందుకే తమ కుమారుడిని వైసీపీలో చేర్చి, తమ ప్రాధాన్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని దగ్గుబాటి దంపతులు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పురందేశ్వరి బీజేపీ తరఫున లోక్‌సభకు, హితేష్ వైసీపీ తరఫున పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నా వైసీపీ అంత ప్రాధాన్యం ఇస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ ఒక సీటే ఇస్తామని జగన్ మెలికపెడితే దగ్గుబాటి రిటైర్‌మెంట్ ప్రకటించక తప్పదేమో.