బీజేపీ నాయకులకు ఏపీలో ఘోర అవమానాలు తప్పడం లేదు. బస్సు యాత్ర ప్రారంభించడానికి శ్రీకాకుళం వచ్చని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కనీసం కుర్చీల నిండా కూడా జనం లేకపోవడంతో ఆయన ఏవో కొన్ని మాటలు మాట్లాడి బస్సు యాత్రకు జండా ఊపి వెళ్లిపోయారు. సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. ఇదీ ఏపీలో బీజేపీ పరిస్థితి. ఇక త్వరలో రానున్న మోదీకి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.
ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. నిధుల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీని అధికార తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు చేయడంతోపాటు చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఎలాగైనా ఏపీలో పట్టు వదలకుండా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ అక్కడి ప్రజల స్పందన చూసిన తర్వాత బీజేపీ నాయకులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.
వాస్తవానికి గత నెలలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంటెలిజన్స్ హెచ్చరించడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ పరిస్థితిలో తేడా ఏమీ లేదు. ప్రధాని పర్యటన వరకు.. అంటే ఈనెల 10 వరకు ఏపీలో నిరసనలు చేయాలని టీడీపీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగానే అమిత్ షాకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో నిరసనలు చేపట్టారు.
బీజేపీకి ఏపీలో స్వతహాగా పెద్దగా బలంలేదన్న విషయం తెలిసిందే. కాకపోతే టీడీపీతో తెగదెంపులు చేసుకున్నాక పరిస్థికి మరీ ఇంత దిగజారుతుందా అనే విషయం అంచనా వేసి ఉండకపోవచ్చు. వైసీపీ కూడా నేరుగా బీజేపీతో కలిసి పనిచేయలేని పరిస్థితి ఉంది. అమిత్ షా, ప్రధాని సభలకు వైసీపీ జన సమీకరణ చేయవచ్చు. కానీ అది లీకైతే వైసీపీకే నష్టం. అందుకే జాగ్రత్తపడినట్టు కనిపిస్తుంది.