అమరావతి: ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో సడలింపు సమయాలను కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దీనివ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే లాక్‌డౌన్‌కు వెసులుబాటు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
మరోపక్క రైతుబజార్లలోనూ ప్రజల రద్దీ చాలావరకు తగ్గిపోయింది. ప్రజల్లో వైరస్ పట్ల భయం పెరుగుతోంది. దీంతో అందరూ ఉదయమే కూరగాయలు లాంటివి తీసుకొని వెళ్లుతున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉండడం వల్ల మిగిలిపోయిన కూరగాయలు ఎండలకు పాడైపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
అందువల్ల లాక్ డౌన్ సమయాన్ని ఉదయం 8 లేక 9గంటల వరకు కుదిస్తే మంచిదంటూ రైతులు అధికారులకు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులకు రైతులు చెప్పారు. అందువల్ల ఏపీలో లాక్ డౌన్ సడలింపు సమయం తగ్గే అవకాశం ఉంది. ఇది మంచి నిర్ణయమే అవుతుంది.
లాక్ డౌన్ సడలింపు సమయం తగ్గే అవకాశంపై ఉన్నతస్థాయిలోనూ చర్చ జరుగుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం వస్తుందని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ విజయవాడలో శనివారం వెల్లడించారు. లాక్‌డౌన్ సమయాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సడలిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రజలు తమకు సూచిస్తున్నారని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఇది కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంది కూడా.
హలో ఏపీ, 29 మార్చి 2020