మిథాలీ రాజ్ మరోసారి విమర్శకులపై ఫైర్ అయింది. ప్రతిసారీ తననే టార్గెట్ చేస్తూ విశ్లేషణలు, విమర్శలు చేస్తున్నవారు టీమ్‌లో మిగతా ఆటగాళ్ల ఆటతీరు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. టీ20 మ్యాచ్‌లలో తన కంటే దారుణంగా ఆడుతున్నవారు చాలామంది ఉన్నారనీ, వారిని ఎవరూ గమనించడం లేదా అని ప్రశ్నించారు.
తనపైనే ఎందుకు ప్రతిసారీ వేలెత్తి చూపుతారనీ, మిగతా ఆటగాళ్ల స్ట్రయిక్ రేట్ గురించి ఎందుకు ఆలోచించరని మండిపడింది. చాలాకాలం నుంచి టీ 20లలో మిథాలీ ఆట గురించి చర్చ జరుగుతుంది. నిదానంగా ఆడే మిథాలీ వేగానికి ప్రాధాన్యం ఇచ్చే టీ 20లకు పనికిరాదని అనేక విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 చాలెంజ్ తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లలో 100లోపు స్ట్రయిక్‌రేట్‌తో చాలామంది ఉన్నారు. కానీ, దీన్ని ఎవరైనా గమనించారా? అని మిథాలీ ప్రశ్నించింది. ముంబై యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆటతీరును పరోక్షంగా ప్రస్తావించింది. ఇంగ్లండ్ సిరీస్‌లో రోడ్రిగ్స్ 22 బంతులాడి 11 పరుగులే చేసింది. ఇలాంటి విమర్శల వల్లనే నేను రెబెల్‌గా మారుతున్నానని మిథాలీ పేర్కొంది.