ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరి నోట చూసినా పీకే మాటేనంట. ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోయేది ఈ పీకేనే అంట. జేసీ దివాకర్ రెడ్డి నుంచి ఇతర టీడీపీ నేతలు అంతా ఈ పీకే మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వైకాపా నేతలు పీకే అంటే ఎంతోకొంత ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వెలువడేదాకా ఇరు పార్టీల నేతలు పీకే గురించి ఆలోచించక తప్పేట్టు లేదు.
పీకే అంటే ఇంతకీ ఎవరనుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కాదు. జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా కాదు. పీకే అంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ స్కీమ్. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ఈపథకం అమల్లోకి వచ్చింది. కానీ దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని టీడీపీ వర్గాల అంచనా.

పసుపు కుంకుమ పథకం కింద ప్రతి డ్వాక్రా మహిళకు పది వేల రూపాయలు బ్యాంకుల్లో వేశారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు డబ్బులు రావడంతో మహిళలు తప్పనిసరిగా తమకు ఓట్లు వేసి ఉంటారని టీడీపీ భావిస్తుంది. పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా, పీకే వల్ల తమకు నష్టం జరుగుతుందేమోనని వైసీపీ కూడా ఆందోళన చెందుతోంది.
ఈ పీకేతోపాటు, ఇంకో పీకే కూడా రెండు పార్టీల్లో చర్బనీయాంశంగా మారింది. అదే పవన్ కళ్యాణ్. ఎవరి ఓట్లకు ఎక్కడ ఎంత గండి పడుతుందో నేతలకు అర్థం కావడం లేదు. కేవలం టీడీపీకో, వైసీపీకో కాకుండా, రెండు పార్టీలకు పీకే నష్టం చేయవచ్చు. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనేది ఫలితాల తర్వాతే తేలనుంది.