తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏపీ రాజకీయాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. తెలంగాణకు వచ్చి టీఆర్ ఎస్‌ను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని కేసీఆర్ ఆనాడు చెప్పారు. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి టీఆర్ ఎస్ నాయకులు చంద్రబాబు ఓటమికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, ఈ ప్రక్రియలో జగన్ పార్టీకి మద్దతు ఇస్తామని అనేక సార్లు వీళ్లు చెప్పారు.
తలసాని శ్రీనియాస యాదవ్ మరో అడుగు ముందుకేసి ఏపీలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. యాదవ కులస్తులు అందరినీ ఒకతాటిపైకి తెచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా జట్టుకడతానని ప్రతిన బూనారు. కేటీఆర్ ఏకంగా జగన్ నివాసం ఉండే లోటస్ పాండ్‌కు వెళ్లి జగన్ కలిసి తన మద్దతు తెలిపారు. కేసీఆర్ కూడా జగన్‌ను త్వరలో కలుస్తారని చెప్పారు.
మరి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, ప్రచారం హోరుగా సాగుతుంటూ కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబును ఏమీ అనకుండా తమ పని తాను చేసుకుపోతున్నారు. కేసీఆర్ ప్రచార సభల్లో గతంలో తిట్టినట్టుగా ఆంధ్రోళ్లను తిట్టడం లేదు, చంద్రబాబును తిట్టడం లేదు. కేటీఆర్ అయితే ఏపీ ఎన్నికలతో మాకేం సంబంధం లేదు అంటున్నారు. అక్కడ మా పార్టీకి ఆఫీసులు లేవు, శాఖలు లేవు కదా అంటున్నారు. తలసాని పత్తా లేడు. ఒక్కసారిగా టీఆర్ ఎస్; కేసీఆర్ ధోరణిలో ఈ మార్పు ఏంటా అని జనం ఆలోచిస్తున్నారు.
చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేసి తమకు ప్రయోజనం కలిగించారని కేసీఆర్‌కు అవగతమై ఉంటుంది. ఇప్పుడు తాను కూడా అదే చేసి చంద్రబాబును గెలిపించడం ఎందుకని అనుకున్నట్టున్నారు కేసీఆర్. అందుకే ఎక్కడా చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం లేదు. పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోగా కేసీఆర్ ఏమైనా వ్యూహం మారుతుందేమో చూడాలి.