ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, అధికార పార్టీ చేపట్టిన నిరసనలు జనసేల, వామపక్షాల మధ్య అభిప్రాయ భేదాలకు కారణమైనట్టు కనిపిస్తుంది. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పవన్ కళ్యాణ్ గానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటనలు కూడా రిలీజ్ చేయలేదు.
మరోవైపు వామపక్షాలు మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీపీఎం నేత పి. మధు, సీపీఐ నేత రామకృష్ణ ఆందోళనల్లో పాల్గొన్నారు. మట్టికుండలు, నీళ్ల కుండలతో తీవ్ర నిరసనలు తెలిపారు. చాలా చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కూడా వామపక్షాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఈ పరిణామాలు జనసేన, వామపక్షాల మధ్య విభేదాలను సూచిస్తున్నాయా?
మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాల నేతలతో సఖ్యతగా మెలుగుతున్నారు. అనేక సమావేశాలు, మీటింగుల్లో వామపక్షాల నేతలతో కలిసి పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి కామన్ అజెండా కూడా రూపొందిస్తామని చెప్పారు. కానీ ఇటీవలి పరిణామాలు ఇద్దరి మధ్య దూరం పెంచినట్టు తెలుస్తోంది.
175 స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఆ మధ్య పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే వామపక్షాలతో పొత్తు లేనట్టే కదా అనే రీతిలో సంకేతాలు వెలువడ్డాయి. తర్వాత వామపక్షాల నేతలతో మాట్లాడినప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం వామపక్షాల్లో ఏర్పడినట్టు సమాచారం. తాజాగా మోదీ వ్యతిరేక ఆందోళనల్లో జనసేన లేకపోవడం, వామపక్షాలు టీడీపీ కార్యకర్తలతో నిరసనలు చేయడం జనసేన, లెఫ్ట్ పార్టీల మధ్య పెరిగిన దూరాన్ని తెలియజేస్తున్నాయి.