ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై వచ్చినన్ని విమర్శలు, ఆరోపణలు గతంలో వచ్చి ఉండవు. జగన్ కోడి కత్తి కేసు దగ్గర్నుంచి అనేక సందర్భాల్లో ఏపీ పోలీసుల విశ్వసనీయత అనేక రకాలుగా విమర్శలకు గురవుతుంది. తాజాగా అమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ భార్య పద్మశ్రీ తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, అందుకే హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తున్నానని చెప్పడంతో మరోసారి ఏపీ పోలీసులు వార్తల్లోకెక్కారు.
జయరామ్ హత్యకేసులో శిఖా చౌదరి పాత్రపై మొదట్లో అనుమానాలు ఉన్నప్పటికీ, దర్యాపు తర్వాత పోలీసులు ఆమె పాత్రను ఎక్కడా ప్రస్తావించలేదు. మొత్తం హత్య వ్యవహారంలో రాకేశ్ రెడ్డి, అతని డ్రైవరే నిందితులుగా పేర్కొన్నారు. అయితే జయరామ్ భార్య మాత్రం తన భర్త హత్యలో శిఖా చౌదరి పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులు సరిగా విచారంచనందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియా ముందు చెప్పింది. తాజాగా ఈ కేసు తెలంగాణ పోలీసుల చేతికి వచ్చింది.
గతంలో విశాఖ విమానాశ్రమంలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగిన తర్వాత జగన్ హైదరాబాద్ వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పట్లో జగన్ కూడా తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల కూడా ఇంటర్నెట్లో తనకు, ప్రభాస్‌కు మధ్య సంబంధం ఉందంటూ వీడియోలు, కామెంట్లు పెట్టినవారిపై చర్యల కోసం హైదరాబాద్ పోలీసులకే ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా ఏపీ పోలీసుల విశ్వసనీయతపై చర్చ ముందుకొచ్చింది.
మళ్లీ జగన్ ఢిల్లీ వెళ్లి ఏపీ పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. డీజీపీని, మరికొంత మంది అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో పదోన్నతులన్నీ ఒక కులం వారికే ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీనికి డీజీపీ స్పందించి పోలీసులకు కులం ఉండదనీ, తమది ఖాకీ కులం అనీ వ్యాఖ్యానించడం విశేషం.