తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది తీవ్ర ఒత్తిడిలో కూడా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం విస్తరణ గురించి ఏమాత్రం క్లూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం కేసీఆర్ దృష్టి అంతా యాదాద్రి దేవాలయం విస్తరణ, అభివృద్ధి మీదనే ఉంది. అంతేకాదు.. మరో భారీ యాగానికి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారట. పాపం ఎమ్మెల్యేలు…. ఇంకా ఎన్నాళ్లు వేచిచూడాలో.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలు కావస్తుంది. తనతోపాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. పరిపాలన అంతా ప్రస్తుతం వీరిద్దరే చూస్తున్నారు. మహమూద్ అలీకి కేటాయించిన హోం, మైనారిటీ వ్యవహారాలు తప్ప మిగతా శాఖలన్నీ కేసీఆర్ వద్దనే ఉన్నాయి. టెక్నికల్‌గా మంత్రివర్గం ఏర్పాటైనా, ఒకే మంత్రితో 33 జిల్లాల రాష్ట్ర పాలనను నెట్టుకురావడం సరైన సాంప్రదాయం కాదు.
అసలు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచి కేసీఆర్ బయట కనిపించిందే తక్కువ. కొత్త అసెంబ్లీ ఏర్పాటు, ప్రమాణం అనంతరం చంద్రబాబును బాగా తిట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్, రిపబ్లిక్ డే, అయిదు రోజులు సహస్ర చండీ యాగం సమయంలో తప్ప పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఏమీ లేవు.
విస్తరణ కసరత్తు పూర్తయిందో లేదో గానీ, మరో యాగానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం. యాదాద్రికి ఒక రూపు రేఖలు వచ్చాక సహస్రాష్టక మహా కుండ యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. యాగాలు చేస్తే మంచిదేలే కానీ, ఆ విస్తరణ ఏదో పూర్తి చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఆశావహులు ఆశపడుతున్నారు.