బాల‌య్య‌పై పాల్ అస్త్రం… యాంక‌ర్‌ శ్వేతా రెడ్డి

ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, యూట్యూబర్ శ్వేతా రెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీచేయ‌నున్న‌ట్టు త‌నే స్వ‌యంగా వెల్లడించింది. ఇంత‌కీ ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారా? ఇంకెవ‌రు… మ‌న వ‌న్ అండ్ ఓన్లీ కేఏ పాల్ స్థాపించిన ప్ర‌జా శాంతి పార్టీ నుంచి శ్వేతా రెడ్డి పోటీ చేయనుంది. ఈ మేర‌కు కేఏ పాల్ టికెట్ దాదాపు ఖ‌రారు కూడా చేశారంట‌.

ఎన్‌టీవీ, సీవీఆర్ న్యూస్‌, త‌ర్వాత ఐడ్రీమ్స్‌, భవానీ మూవీస్ లాంటి ప‌లు యూట్యూబ్ చానెళ్ల‌లో శ్వేతా రెడ్డి ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఆమె ఇంట‌ర్వ్యూల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. ఇటీవ‌ల ఒక స‌మావేశంలో కేఏ పాల్‌తో జ‌రిగిన సంభాష‌ణ‌లో శ్వేతారెడ్డిని పార్టీలోకి పాల్ ఆహ్వానించారు. దీంతో ఆమె కూడా అంగీక‌రించారు.

swetha reddy anchor

అయితే హిందూపురం టికెట్ క‌న్‌ఫ‌ర్మ్ కావ‌డానికి కొన్నిష‌ర‌తులు విధించార‌ట పాల్‌. ఆమె ప‌ది వేల మందిని పార్టీలోకి చేర్పించాల‌ట‌. రెండు నెల‌ల స‌మ‌యంలో ప‌ది వేల మందిని, ఒక్కో స‌భ్యుని వ‌ద్ద నుంచి ప‌ది రూపాయ‌ల స‌భ్య‌త్వ రుసుం క‌ట్టించుకొని ప్ర‌జాశాంతి పార్టీలో చేర్పించాలి. అప్పుడు శ్వేతా రెడ్డికి టికెట్ క‌న్‌ఫ‌ర్మ్ అవుతుంది.

హిందూపురం ప్ర‌స్తుత ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ‌. అంటే శ్వేతారెడ్డి బాల‌కృష్ణ‌తో పోటీప‌డ‌నున్నార‌న్న‌మాట‌. క్రైస్త‌వుల ఓట్లు అన్నీ త‌మ‌కే వ‌స్తాయ‌ని కూడా ఆమె చెబుతున్నారు.