ఏపీలో ఏమీ అభివృద్ధి జరగడం లేదనీ, అంతా గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప అక్కడ ఏమీ లేదని విమర్శిస్తున్నవారికి టీడీపీ ప్రభుత్వం గట్టిగానే జవాబు చెబుతున్నట్టుంది. పోలవరం, అమరావతిలో ఏం జరుగుతుందో ప్రజలకు స్వయంగా చూపించడానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు. పోలవరం పనులు, అమరావతిలో నిర్మాణాలను అధికారులు, నాయకులు దగ్గరుండి జనాలకు చూపిస్తున్నారు.
దీంతో పోలవరం, అమరావతి ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. రోజూ వేల సంఖ్యలో ప్రజలు ఈ ప్రదేశాలకు వచ్చి పనులు చూసి వెళుతున్నారు. అందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక దగ్గరలో ఏవైనా చూడదగిన ప్రదేశాలుంటే పనిలోపనిగా వాటినీ చూపించి ఇళ్ల దగ్గర దిగబెడుతున్నారు.
పోలవరం తీసుకెళ్లిన వారిని డ్యాం దగ్గర ఫొటోలు తీయించడం, వారిచేత చంద్రబాబుకు జై కొట్టించడం, కొందరి అభిప్రాయాలను తీసుకొని వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో ప్రచారం చేయడం భారీగా జరుగుతుంది. ప్రజలను ద్వారకా తిరుమల కూడా తీసుకెలుతున్నారు.
అమరావతి సందర్శించే వారికి ఏపీ సీఆర్‌డీఏ సకల ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక బస్సుల్లో జనాన్ని వెలగపూడి, ఇతర ప్రదేశాలకు తిప్పి ఆయా కార్యాలయాలను, నిర్మాణ పనులను చూపించి వివరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ఇది నిరంతరం జరిగేలా ఉంది. ఇంతకీ ఈ పర్యటనలకు వాడుతుంది పార్టీ నిధులా, ప్రభుత్వ నిధులా..?