వ‌రుణ్ తేజ్ వాల్మీకి సినిమాకి టైటిల్ క‌ష్టాలు

ప్ర‌జ‌ల్లో వ‌స్తోన్న సామాజిక చైత‌న్యాన్ని సినిమావా వాళ్లు ఇంకా గుర్తించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సినిమా టైటిళ్లు, పాట‌లు, డైలాగుల విష‌యాల్లో జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌టు క‌నిపించ‌డం లేదు. ఏదో ఒక వివాదం ద్వారా ప‌బ్లిసిటీ తెచ్చుకోవ‌డం కూడా ఒక వ్యూహ‌మే అయిన‌ప్ప‌టికీ, ఇది సినిమా రంగంలో కొర‌వ‌డిన సామాజిక స్పృహ‌ను కూడా తెలియ‌జేస్తుంది.

ఆ మ‌ధ్య మ‌న్మ‌ధుడు సినిమాలో నాగార్జున మీటింగ్‌కు సంబంధించి వాడిన డైలాగులో త‌మ‌ను కించ‌క‌రిచారంటూ ఒక సామాజిక వ‌ర్గం వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో కూడా చ‌ర్చ జ‌రిగి చివ‌ర‌కు ఆ డైలాగ్‌ను మ్యూట్ చేశారు.

తాజాగా హ‌రీష్ శంక‌ర్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న వాల్మీకి సినిమా టైటిల్‌పై కూడా వివాదం రాజుకుంది. ఆ టైటిల్‌లో గ‌న్‌, క‌త్తి ఉండ‌టం అభ్యంత‌ర‌క‌రంగా మారింది. జాతీయ వాల్మీకి ఐక్యపోరాట సమితి అధ్వర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేపట్టారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై గన్, మారణాయుధాలను పెట్టి త‌మ వ‌ర్గం మ‌నోభావాల‌ను అవమానించారని వారు తెలిపారు.

ఎంతో గొప్ప ర‌చ‌యిత‌, మ‌హ‌ర్షి అయిన వాల్మీకి పేరును ఇలా గ్యాంగ్‌స్టర్ సినిమా టైటిల్‌గా పెట్ట‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదని ఆ సంఘం వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చ‌క‌పోతే షూటింగ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.