మ‌హిళ‌ల ఓట్ల‌పై చంద్ర‌బాబు భారీ ఆశ‌లు

ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భారీ వ్యూహం ప‌న్నిన‌ట్టు ఉంది. మ‌హిళ‌లే ల‌క్ష్యంగా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు తెర‌దీశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డంతోపాటు, ద‌శ‌ల వారీగా ప్ర‌యోజనం అందించే అనేక స్కీమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మ‌హిళ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డానికి అనేక ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు.

chandranna pelli kanuka

ఏపీలో దాదాపు కోటి మంది మ‌హిళ‌లు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల స‌భ్యులుగా ఉన్నారు. వీరంద‌రికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వీరి అకౌంట్ల‌లోకి వ‌చ్చే 10 రోజుల్లో ఒక్కొక్క‌రికి రూ.10 వేల చొప్పున ప‌డ‌నున్నాయి. ప‌సుపు – కుంకుమ ప‌థ‌కం ద్వారా వీరికి ఈ డ‌బ్బు అంద‌నుంది. మూడు ద‌శ‌ల్లో దీన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తారు.

మ‌రో ప‌థ‌కం.. స్మార్ట్ ఫోన్లు పంపిణీ. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలోని ప్ర‌తి మ‌హిళ‌కు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వ‌నున్నారు. దీన్ని కూడా ఎన్నిక‌ల ప్రక‌ట‌న వెలువ‌డక ముందే అమ‌లు చేయ‌నున్నారు. ఇక చంద్ర‌న్న పెళ్లి కానుక ద్వారా అనేక మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొంద‌నున్నారు. కులాన్ని బ‌ట్టి రూ.35 వేల నుంచి రూ.75 వేల వ‌ర‌కు ఈ ప‌థ‌కం కింద లబ్ధి పొందే అవ‌కాశం ఉంది.

ఒకే రోజు రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన ప్రాంతాల్లో స‌భ‌లు నిర్వ‌హించి ఈ ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తున్నారంటే చంద్ర‌బాబు వీటిపై పెట్టుకున్న ఆశ‌ల‌ను తెలుసుకోవ‌చ్చు. జ‌న‌వ‌రి 25న ఉద‌యం అమ‌రావ‌తిలో, మ‌ధ్యాహ్నం క‌డ‌ప‌లో, సాయంత్రం వైజాగ్‌లో ఈ ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు ప్రారంభించ‌నున్నారు.