ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పార్టీలన్నీ ప్రచారం వైపు దృష్టి మరల్చాయి. మామూలు బహిరంగ సభలు, సమావేశాలు ఒక ఎత్తయితే యువతను ఆకర్షించడానికి ప్రధాన ప్రచార మార్గం సోషల్ మీడియానే. ప్రచారంలో భాగంగా ఏ పార్టీ కూడా సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు.
బీజేపీ మొదటి నుంచీ ఆన్‌లైన్‌లో ప్రచారానికి పెద్దపీట వేస్తుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి సోషల్ మీడియా ప్రచారం కూడా ఒక కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. సాంప్రదాయ పద్ధతిలో ప్రచారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ రంగప్రవేశంతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది.
ఏపీ విషయానికొస్తే… ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విజృంభిస్తోంది. రకరకాల పేర్లతో ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌లలో ప్రచారానికి తెరదీసింది. టీడీపీతో పోల్చుకుంటే వైసీపీ, జనసేన ఈ విషయంలో వెనకబడ్డాయనే చెప్పాలి. జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా ప్రచారం చేయడం తప్ప ఆన్‌లైన్‌లో ప్రచారంపై వ్యూహం ఉన్నట్టు కనిపించడం లేదు.
వైసీపీ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ టీడీపీతో పోటీ పడే స్థాయిలో లేదు. ఫేస్‌బుక్ ప్రచారంలో టీడీపీ దూసుకుపోతోంది. చంద్రబాబు, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు మొదలైనవాటికి ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేసి ఊదరగొడుతోంది. మంత్రులు, అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర మరింత కీలకం కానుంది.