కుంభమేళా సందర్భంగా ఉత్తర ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. యూపీలోని 60 ఏళ్లు పైబడిన సాధువులకు పించను ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు రూ.500 చొప్పున వీరికి పించను ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ద్వారా హిందువుల ఓట్లను ఆకర్షించడానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
కుంభమేళా సందర్భంగా లక్షల సంఖ్యలో సాధువులు ప్రయాగరాజ్ (అలహాబాద్) సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నదే అని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. మరోవైపు ఇతర మతాల వారు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
హిందూ సాధువులకు ఇచ్చినట్టుగానే, ముస్లిం ఉలేమాలకు, క్రిస్టియన్ ఫాదర్లకు, జైన, బౌద్ధ మత ప్రబోధకులకు కూడా పించన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హిందు సాధువులకే దీన్ని పరిమితం చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల సమయంలో విభజన రాజకీయాలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.