తెలంగాణలో తొలి దశ పంచాయితీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయి. మొదటి దశలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 2606 మంది టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో వేలాది పండితుల మధ్య చండీయాగం చేస్తుండగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడటం విశేషం. దీంతో చాలామంది పండితులు కేసీఆర్ యాగ ఫలితమే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం అని విశ్లేషణలు మొదలుపెట్టారు.
తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 906 పంచాయతీలను గెలుచుకుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్కు ఈ ఫలితాలు కొంచెం ఆశాజనకమే. ఆశ్చర్యకరంగా, 67 పంచాయితీలు గెలిచి మూడవ స్థానంలో బిజెపి నిలిచింది. టిడిపి, వామపక్షాల కంటే తమకు గ్రామాలలో మంచి మద్దతు ఉన్నదని బిజెపి నిరూపించింది. సిపిఎం, టిడిపి మద్దతుదారులు వరుసగా 32, 30 పంచాయతీల్లో గెలుపొందారు.
ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా కేటీఆర్ పార్టీలో తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నారు. టీఆర్ ఎస్ కార్యనిర్వహక అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికలు ఇవి. వీటిలో ఘన విజయం సాధించడం ద్వారా కేటీఆర్ పార్టీపై కింది స్థాయి నుంచి మరింత పట్టు సాధించే అవకాశం ఉంది.