తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల అనుభవం ఏపీలో చంద్రబాబు నాయుడుకు బాగా ఉపయోగపడుతున్నట్టుంది. సెంటిమెంట్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం లాంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల పించను రూ.1000 నుంచి రూ.2000 లకు పెంచారు. మరిన్ని పథకాలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావచ్చు. అంటే ఇంకా ఓ నెల మాత్రమే. ఈలోగానే ప్రభుత్వం తన పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ వస్తే ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. అందువల్ల చంద్రబాబు ప్రభుత్వం తొందరపడుతుంది. కేసీఆర్ విజయంలో కీలకమైన రైతు బంధు పథకాన్ని మార్పులు, చేర్పులతో రైతు రక్షగా అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది.
రైతు రక్షలో భూమి యజమానులైన రైతులతోపాటు, కౌలుదారులను కూడా చేర్చనున్నారు. దీనివల్ల కోటి మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా ఇచ్చే సొమ్మును నేరుగా రైతులు, కౌలుదారుల బ్యాంకు ఖాతాల్లోకి వేస్తారు. దీనివల్ల రైతులకు చెక్కులు తీసుకొని బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు.
దీంతోపాటు మరికొన్ని పథకాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఉద్యోగులకు ఇళ్ల పథకం రానుంది. రైతు రక్ష పథకాన్ని ఖరీఫ్ సీజన్ నుండి అమలు చేయాలని ఆలోచనగా ఉంది. పథకం యొక్క వివరణాత్మక మార్గదర్శకాలు 2019 జనవరి 21 న కేబినెట్ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు.