జగన్, కేటీఆర్ మీటింగుతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొత్తపుంతలు తొక్కనున్నాయి. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి చేతులు కాల్చుకున్న చందంగానే, జగన్ కూడా టీఆర్ఎస్తో జతకట్టి ఏపీలో మునుగుతారా తేలుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పేరుకు జగన్, కేటీఆర్ మీటింగ్ ఉద్దేశం జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అయినప్పటికీ, ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వ్యూహాలు రచించడం కూడా ఇందులో చర్చకు రావచ్చు.
ఏపీలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఎలాంటి భావం ఉంటుందనే దాన్ని బట్టి జగన్ – టీఆర్ఎస్ మైత్రి ఫలితం ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్ఎస్ను, ఆ పార్టీతో సఖ్యతగా మెలిగేవారిని ఏపీ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఏపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు విభజన కారణం, విభజన జరగడంలో టీఆర్ఎస్ కీలకం కాబట్టి ప్రజలు అంత త్వరగా వాటిని మరిచిపోయే అవకాశం లేదు.
అంతేకాదు, కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆంధ్ర నాయకులు, అక్కడి వ్యవహారాల గురించి చులకన చేసి మాట్లాడటం కూడా టీఆర్ఎస్ పట్ల ఏపీలో వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. టీఆర్ఎస్తో రాజకీయంగా సఖ్యతతో ఉండే వారిపై కూడా దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
విభజనకు కారణమైన మరో ముఖ్య పార్టీ కాంగ్రెస్తో కలిసి వెళ్లే సాహసం జగన్ చేయకపోవచ్చు. ఆ అవకాశం కూడా లేదు. అలాగే ప్రస్తుతం ఏపీలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీతో కూడా జగన్ కలిసి వెళ్లలేరు. ఇక టీఆర్ఎస్కు ఏపీలో ఏమీ బలం లేదు. మరి టీఆర్ఎస్కు దగ్గరగా వెళ్లడానికి జగన్ను ఏం ప్రేరేపించి ఉండొచ్చు. కేసీఆర్ తమ ఫ్రంట్ కాంగ్రెస్, బీజేపీలకు దూరం అంటున్నారు కాబట్టి ఇలా వెళితే జనంలో వైసీపీ, బీజేపీ వేర్వేరు అనే భావన ఏర్పడి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందనే ఆలోచన కూడా జగన్కు ఉండొచ్చు.