మంచి భవిష్యత్తు ఉన్నయువ క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. కాఫీ విత్ కరణ్ జొహార్ షోలో మహిళలపై అసభ్యకర, అభ్యంతరకరమైన రీతిలో కామెంట్లు చేసిన యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వైఖరిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఇద్దరినీ తక్షణం అన్ని రకాల క్రికెట్ మ్యాచ్ల నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇద్దరూ వెనక్కి రానున్నారు.
అంతేకాదు.. వీరిద్దరి కామెంట్లపై బీసీసీఐ విచారణ కమిటీని నియమించింది. పూర్తిగా విచారణ తర్వాత బీసీసీఐ అంతిమ నిర్ణయం వెలువడనుంది. తన కామెంట్లపై హార్దిక్ పాండ్యా విచారం వ్యక్తం చేశాడు. టాక్ షోలో అనుకోకుండా అలా మాట్లాడాననీ, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయితే బీసీసీఐ దీనిపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ వివరణలో నిజాయతీ లేదని పేర్కొంది.
దీంతో ఇద్దరు క్రికెటర్ల భవితవ్యం ఏంటనేది వేచి చూడాలి. విచారణ కమిటీ నివేదికను బట్టి జట్టులో వీరి స్థానం ఆధారపడి ఉండొచ్చు. ఇప్పటికే జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మళ్లీ వీళ్లు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు విరాట్ కోహ్లి కూడా మహిళలపై రాహుల్, పాండ్యా వ్యాఖ్యలను భారత జట్టు ఖండిస్తున్నట్టు ప్రకటించాడు.