ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ జట్టు ఓటమికి ధోనీనే కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 96 బంతులు ఆడి 51 పరుగులు చేసిన ధోనీ, తన రికార్డుల కోసం ఆడాడు తప్ప జట్టు విజయం కోసం ఆడలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ధోనీ క్రీజులోకి వచ్చినప్పటి ఆట పరిస్థితిని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. 4 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన దశలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో రోహిత్ శర్మతో కలిసి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బాల్స్ ఎక్కువ తిన్నప్పటికీ ధోనీ ఔటయ్యే సమయానికి మంచి స్థితిలోనే ఉంది. టార్గెట్ చిన్నదే కాబట్టి ఇంకాసేపు క్రీజులో ఉంటే ధోనీ వ్యూహం కూడా దానికి తగ్గట్టు మారేది. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా కాసేపు నిలదొక్కుకొని ఉంటే ఫలితం వేరేగా ఉండేది.
రెండు డకౌట్లను, 5 ఓవర్లు కూడా నిలకడగా ఆడలేని రవీంద్ర జడేజాను వదిలేసి ధోనీని విమర్శించడం సరికాదు. ఇంకో 4-5 ఓవర్లు ధోనీ ఉంటే రన్‌రేట్ పెరిగేదేమో. ఓడిపోయినప్పుడు అభిమానులు భావోద్వేగంతో వ్యాఖ్యలు చేయడం సహజం. వరల్డ్ కప్ తుది జట్టులో ధోనీని ఎంపిక చేస్తారా లేదా అనేది ఈ ఒక్కమ్యాచ్‌ను బట్టే ఉండకపోవచ్చు.