బాల‌కృష్ణ గారూ.. అదుపులో ఉంటే మంచిది: నాగ‌బాబు వార్నింగ్‌

బాల‌కృష్ణ మీద ఇటీవ‌లి కాలంలో భారీగా విమ‌ర్శలు చేస్తున్న నాగ‌బాబు, మ‌రోసారి ఫేస్‌బుక్ ద్వారా బాల‌య్యపై విరుచుకుప‌డ్డారు. ఎప్పుడో 6 సంవ‌త్స‌రాల కింద‌ట చిరంజీవిపై బాల‌కృష్ణ చేసిన‌ట్టుగా కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఉటంకిస్తూ బాల‌కృష్ణ‌కు వార్నింగ్ ఇచ్చారు. రాజ‌కీయాల్లో ఏవైనా విభేదాలుంటే విమ‌ర్శించుకోవ‌చ్చ‌ని, కానీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే బాగుండ‌దని హెచ్చ‌రించారు. అంతేగాక ఇది త‌న చివ‌రి స్పంద‌న అనీ, ఇక ఈ వివాదానికి సంబంధించి మాట్లాడ‌న‌నీ చెప్పారు. అయితే నాగ‌బాబుపై బాల‌య్య అభిమానులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.

2012లో బాల‌కృష్ణ ఏదో సంద‌ర్భంలో మాట్లాడుతూ… చిరంజీని ఎన్టీఆర్ కాలిగోటికి కూడా స‌రిపోడ‌ని అన్నట్టు నాగ‌బాబు చెప్పారు. దానిపై తాను ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాన‌నీ, ఎప్పుడైనా రియాక్ట్ కావ‌చ్చ‌నీ, దానికి టైం ఏమీ లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ఎవ‌రూ అంగీక‌రిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డం లేదు. ఎప్పుడో జ‌రిగిన దానికి, ఇప్పుడు ఆధారాలు కూడా ఏమీ ద‌గ్గ‌ర లేకుండా అలా మాట్లాడ‌టం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

చిరంజీవి మాకు అన్న‌య్య కాద‌నీ, తండ్రితో స‌మాన‌మ‌నీ నాగ‌బాబు చెప్పారు. బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి నేరుగానే ప్ర‌స్తావిస్తూ మాట్లాడారు. మీ కుటుంబం, నాన్న గారు మీకు ఎలాగో, మాకు మా అన్న‌య్య కూడా అంతేకంటే ఎక్కువ‌నీ, రాజ‌కీయంగా ఏవైనా ఉంటే ఎదుర్కోవాలి గానీ, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తే మేం ఏం చేయాలో మాకు తెలుస‌ని బాల‌కృష్ణ‌ను హెచ్చ‌రించారు.

అయితే బాల‌కృష్ణ అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో నాగ‌బాబును విప‌రీతంగా టార్గెట్ చేసి విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న వీడియోకు వ‌చ్చిన కామెంట్ల‌లో ఎక్కువ‌మంది ఆయ‌నకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. 20వేల లైక్స్ వ‌స్తే 5వేలు అన్‌లైన్ వ‌చ్చాయి. నాగ‌బాబు ఆపినా, ఫ్యాన్స్‌లో మాత్రం ఈ వివాదం ముగిసేలా లేదు.