గత కొంతకాలంలో టీవీ9లో వార్తలు, రాజకీయ విశ్లేషణలు, ఇంటర్వ్యూలు పరిశీలించిన వారికి తప్పకుండా కలిగే సందేహం…. టీవీ9 ప్లేటు ఫిరాయించిందా అనేదే. ఇటీవలి తెలంగాణ ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌లకు విపరీత ప్రచారం చేసిన టీవీ9, తాజాగా కేసీఆర్, జగన్‌ల బాట పట్టినట్టు అర్థమవుతుంది.
సాక్షి టీవీతోపాటు, టీవీ9లో వైసీపీ అధినేత జగన్ సుదీర్ఘ ఇంటర్వ్యూ ప్రసారం చేసింది. అందులో యాంకర్ రజనీకాంత్ అడిగిన ప్రశ్నల్లో ఏమాత్రం వాడి వేడి లేదు. గతంలో టీవీ9 ఇంటర్వ్యూలకు, దీనికి ఎంతో తేడా. అధిక సమయం చంద్రబాబును తిట్టడానికి ప్రోత్సహించే రీతిలో ఆయన ప్రశ్నలు అడిగారు.
దీనికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. టీవీ9లో తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోమ్ గ్రూప్, మహా సిమెంట్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇటీవల భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన జూపల్లి, కేసీఆర్ ఆదేశాల మేరకే ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వచ్చాయి.
టీడీపీకి, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా సంస్థలను ఒక్కొక్కటి కొనేయడం లక్ష్యంగా జూపల్లి, కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే టీవీ9లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీనికి పర్యవసానంగానే టీవీ9లో చంద్రబాబు వ్యతిరేక వార్తలు, విశ్లేషణలు పెరుగుతున్నాయి. జగన్ కూడా చంద్రబాబు వ్యతిరేకి కావడం, కేసీఆర్ ఏపీలో చంద్రబాబు ఓటమి లక్ష్యంగా పనిచేస్తుండటంతో టీవీ9 కూడా సహజంగానే గొంతు సవరించుకున్నట్టు కనిపిస్తుంది.