ఇటీవల టీవీ9, సాక్షి టీవీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచాక తొలిసారిగా ఫోన్ చేసి… అన్నా, అభినందనలు… టీడీపీని ఓడించి చాలా మంచి పని చేశారు… అన్ని చెప్పినట్టు జగన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించడం విశేషం. కేసీఆర్‌గారు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రధానికి లేఖ రాస్తాననడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. కానీ అదే కేసీఆర్, ఆయన బంధుగణం మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో, అంతకుముందు అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను జగన్ మర్చిపోయినట్టుంది.
ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదాపై కేటీఆర్, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. ఏపీకి హోదా ఇస్తే, హైదరాబాద్‌లో పరిశ్రమలన్నీ అమరావతికి పోతాయనీ, మళ్లీ ఇక్కడివాళ్లు ఉద్యోగాలు లేక పేదరికంలో బతకాల్సి వస్తుందనీ వారు ప్రచారం చేశారు. కవిత, కేసీఆర్ మాటలు ఆన్ రికార్డు అంటున్న జగన్‌కు, కేటీఆర్, హరీష్ మాటలు కూడా ఆన్ రికార్డే అన్న విషయం తెలియదా.
ఏపీ ఎన్నికల్లో అవసరమైతే కేసీఆర్ సహాయం, మోదీ సపోర్టు, ఇతర అభిమానుల మద్దతు తీసుకోవచ్చు. దీనికి కేసీఆర్‌ను వెనకేసుకురావడం ఎందుకు? ప‌్రత్యక్ష సహాయం, మద్దతు తీసుకోవడం ఎన్నికల్లో రిస్క్ అనిపిస్తే పరోక్షంగా తీసుకోవచ్చు. పరోక్ష సహాయం తీసుకోవడానికి కేసీఆర్‌ను అంతగా పొగడాల్సిన అవసరం ఏముంది?