సినీ నటుడు అలీ, ఏ పార్టీలో చేరితే ఏముందిలే గానీ, అన్ని పార్టీల నాయకులను వరుసపెట్టి కలవడమే చూడటానికి బాలేదు. సినిమా హీరోలు, హీరోయిన్లు, కామెడీ యాక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వగైరా రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు, అందులో పెద్దగా సస్పెన్స్ మెయింటెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేకపోతే అంత హడావిడిగా అలీ ఎందుకు ఆ ముగ్గురు నాయకులను కలిసినట్టో మరి?
ముందుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అలీ కలిసారు. దీంతో అందరూ అలీ ఈనెల 9న వైసీపీలో చేరతాడని అనుకున్నారు. ఆరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో అలీ వైసీపీలో చేరతారని ఇంకా అనుకుంటూనే ఉన్నారు. అలీ మాత్రం.. అబ్బే అదేం లేదు… ఉత్తినే మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పానన్నారు. ఇలా అనుకుంటుండగానే మరో డెలవప్మెంట్.
మరుసటి రోజే సినీ నిర్మాత అశ్వనీదత్‌తో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. మరి చంద్రబాబును ఎందుకు కలిసారంటే…. చంద్రబాబు అంటే ఏపీ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ, బాలయ్య వియ్యంకుడు, లోకేష్ నాన్న, దేవాంష్ తాత…. ఇలా చెప్పుకొచ్చారు. దీంతో అర్థమైపోయింది… అబ్బో ఈయన రాజకీయాలకు బాగనే పనికొస్తారనుకున్నారు జనం.
ఆ వెంటనే తన మిత్రుడు పవన్ కళ్యాణ్‌ను కలిసారు. ఇది ఎందుకంటే.. జనవరి ఫస్ట్‌న విష్ చేయడం కుదరలేదు. అందుకే కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి వస్తున్నా అన్నారు. దీంతో జనాలకు ఇక పూర్తిగా అర్థమైంది… అలీ ఎప్పటికైనా మంచి మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు అవుతాడని.
అయ్యా… అలీ గారూ.. మీరు రాజకీయాల్లోకి రాకపోతే బానే ఉంటది.. ఇన్ని కబుర్లు చెప్పి, ఏదైనా పార్టీలో చేరితో జనం మరో బండ్ల గణేష్‌ను మీలో చూసుకుంటారేమో.. జాగ్రత్త.