తెలంగాణ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ, నాగబాబుల మధ్య మొదలైన సోషల్ మీడియా వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ గతంలో అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను కూడా నాగబాబు బయటకు తీస్తున్నారు. వాటికి కౌంటర్‌లు ఇస్తూ తరచుగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ వైపు నుంచి వీటికి ఎలాంటి స్పందన రావడం లేదు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలయ్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనడంతో నొచ్చుకున్న నాగబాబు… తనకు కూడా బాలయ్య అంటే ఎవరో తెలియదని ఒకసారి, సీనియర్ నటుడు బాలయ్య అని మరోసారి, పాతతరం కమేడియన్ బాలకృష్ణ అని ఇంకోసారి సెటైర్లు వేశారు. దీనికి బాలకృష్ణ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
మరో సందర్భంలో బాలకృష్ణ తడబడుతూ పాడిన సారే జహాసే అచ్చా గీతంపై కూడా నాగబాబు విరుచుకుపడ్డారు. ఒక పిల్లాడు ఆ గీతాన్ని పాడుతున్న వీడియోను పోస్టుచేసి చిన్న పిల్లాడివైనా చక్కగా పాడావు అంటూ పరోక్షంగా బాలకృష్ణను విమర్శించారు. ఇది కూడా సోషల్ మీడియా ఇద్దరి అభిమానుల మధ్య వార్‌కు దారితీసింది.
మరో సందర్భంలో బాలకృష్ణ పరోక్షంగా జనసేనను ఉద్దేశించి, అలగా బలగా పార్టీ అని, సంకర జాతి పార్టీ అనే అర్థం వచ్చే రీతిలో విమర్శించారు. దీన్ని కూడా నాగబాబు తాజాగా పైకి తీసుకొచ్చారు. అన్ని కులాలవారు అన్ని పార్టీల్లో ఉంటారనీ, వారిని గౌరవించడం నేర్చుకోవాలని బాలకృష్ణకు సూచించారు.
ఫైనల్‌గా ఇంకో పాయింటు ఉందనీ, దానికి కూడా సమాధానం చెప్పి, నా వీడియోలు, స్పందన ముగిస్తాని నాగబాబు చెప్పారు. అది ఏమై ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా, వ్యవహారం ముదిరి కుల దూషణలు, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకునే స్థాయికి అభిమానులు చేరుకున్నారు. ఇలాగేనా మీ అభిమానులను మీరు ప్రోత్సహించేది సెలబ్రిటీలూ…?