తెలంగాణ పోలీసు శాఖ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్టార్ క్యాంపెయినర్లకు భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మొత్తం 33 మంచి నేతలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రచారానికి వాడుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తయి, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది గానీ,,, ఈ వాహనాల బిల్లులు మాత్రం ఇంకా ఎవరూ కట్టకపోవడం విశేషం. దీంతో కేసీఆర్ సహా, మిగిలిన నేతలందరికీ పోలీసు శాఖ లేఖలు రాసింది. వ్యక్తిగతంగా ఆయా నాయకులకు లేఖలు పంపడంతోపాటు పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం విశేషం. ఇలాగైనా పేపర్లలో, టీవీల్లో వస్తే బిల్లులు కడతారనుకున్నారేమో.
గత సెప్టెంబరు 6 న అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి డిసెంబరు 7 వరకు టీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ సహా, అన్ని ఇతర పార్టీలు కలుపుకొని మొత్తం 33 మంది నాయకులకు బుల్లెట్ ప్రూప్ వాహనాలతో భద్రత కల్పించామనీ, వీరిలో కేసీఆర్‌తో పాటు మాజీ స్పీకర్ మధుసుధనాచారి (ఓడిపోయారు), మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ (ఇద్దరూ ఓడిపోయారు), బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి (ఓడిపోయారు), మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు అన్ని పార్టీల స్టార్ క్యాంపెయనర్‌లు ఉన్నారని తెలిపింది. వాహనాలతోపాటు అందరికీ డ్రైవర్లను కూడా అరేంజ్ చేశారు. ఈ హైటెక్ వాహనాలకు కిలోమీటర్ల ఆధారంగా అద్దెను నిర్ణయించామని, ఒక్కో నాయకుడు రూ.57 వేల నుంచి రూ.7.7 లక్షల వరకు తమకు బకాయి ఉన్నట్లు పోలీసు శాఖ మీడియా ప్రకటనలో వెల్లడించింది.
అయ్యా పెద్ద సార్లూ… పోలీసు శాఖకు కేటాయించేది ప్రజాధనం. ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకోవడం మంచిది కాదు. పోలీసు శాఖకు అసలే నిధులు తక్కువ. మీరు గెలిచినా, ఓడినా దర్జాగా తిరిగినందుకు పైసలివ్వండి.