ఏపీ, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతీ అంశం వివాదాస్పదంగా మారుతోంది. పరిస్థితి చూస్తుంటే, కేంద్రంలోని ప్రతీ విభాగానికి ఏపీ విషయాలపై ప్రత్యేక మార్గదర్శకాలు అందినట్టు కనిపిస్తోంది. లేకపోతే ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇలా వివాదాలు తలెత్తే అవకాశం లేదు. రాజకీయ పార్టీల మధ్య విరోధం ఉండొచ్చు కానీ.. ఇలా ప్రతీ అంశం వివాదంగా మారడం విపరీత ధోరణే.
ప్రపంచ ఆర్థిక మహాసభలకు హాజరవడానికి దావోస్ వెళ్లే బృందంలో సభ్యుల సంఖ్య, అక్కడ ఉండాల్సిన రోజుల విషయంలో మొన్నీ మధ్యనే వివాదం తలెత్తింది. చంద్రబాబు బృందం సభ్యులను తగ్గించడం, పర్యటన రోజులను కుదించడం వివాదాస్పదంగా మారింది. దీంతో చంద్రబాబు నాయుడు కల్పించుకొని అధికారులను మళ్లీ పురమాయించారు.
తాజాగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రదర్శించే శకటాల విషయంలో మళ్లీ వివాదం తలెత్తింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంస్కృతి ప్రతిబింబించేలా శకటాలను తయారు చేస్తుంటాయి. అయితే ఏపీ జాతీయ భావాలు సూచించేలా గాంధీ థీమ్‌తో శకటం చేసింది. మీ శకటం బాగాలేదంటూ కేంద్రం తిరస్కరించడం వివాదానికి దారితీసింది. రిపబ్లిక్ డే ప్రదర్శనలో ప్రదర్శించడానికి తిరస్కరించింది. శకటం ఎలా ఉండాలో కూడా సూచించారు.
ఇంకా దారుణం ఏంటంటే… ముందు మీ శకటం బాగుందని ప్రశంసించిన అధికారులు.. తర్వాత తిరస్కరించడం. వాస్తవానికి శకటంలో ఉన్న విషయం ఏంటంటే… స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఏపీలో జరిగిన మూడు ముఖ్య ఘట్టాలు.. గాంధీ చిత్రం. వీటిలో అభ్యంతరకరమైనవి ఏం ఉన్నాయో మరి.