తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినప్పటికీ బాగా పాపులర్ నాయకుడు రేవంత్ రెడ్డనే చెప్పవచ్చు. తెలంగాణలోని ఏ సమస్య మీదైనా అనర్గళంగా మాట్లాడటం, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా బాగా అర్థమయ్యే రీతిలో విషయాలను చెప్పడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతాడని ఆయన అభిమానుల ఆశ, ఆకాంక్ష. అయితే రేపటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా అంటే, ఏదో అద్భుతం జరిగితే తప్ప కష్టమనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ప్రస్తుతం సీఎం కావడానికి అనేక అవరోధాలు ఉన్నాయి.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం ముఖ్యమైన అవరోధం. ఏడాది కిందట పార్టీలో చేరిన నాయకుడికి సీఎం పదవి కట్టబెట్టడం సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ఏమేరకు అంగీకారయోగ్యం అనేది ప్రశ్నార్థకం. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. అయితే దీన్ని కొనసాగించాలనేమీ లేదు. గతంలో డీ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ, ఆ నాయకులు, ఈ నాయకులకీ తేడా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఏ నాయకుడినీ వైఎస్‌తో పోల్చలేం. అందువల్ల వై ఎస్ అయినట్టే రేవంత్ రెడ్డి కూడా సీఎం అవుతాడని చెప్పలేం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయితే రేవంత్ రెడ్డి పార్టీలో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి రెండూ ఒక్కరే చేపట్టరు కాబట్టి రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి పెద్దగా వ్యతిరేకత కూడా ఉండకపోవచ్చు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకొని 2023లో సీఎం పదవి చేపట్టడానికి ప్రయత్నించవచ్చు. రేవంత్ రెడ్డికి కూడా ఇప్పటికిప్పుడు సీఎం అవుదామనే కోరిక లేకపోవచ్చు. కానీ 2023లో అవకాశాలు మాత్రం రేవంత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ… లేకపోతే ఇఫ్స్, బట్సే…