చంద్ర‌క‌ళ ఐఏఎస్‌కు ఇసుక మాఫియాతో లింక్ – సీబీఐ సోదాలు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ చంద్ర‌క‌ళ ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. సీబీఐ అధికారులు క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని చంద్ర‌క‌ళ నివాసానికి వెళ్లి రావ‌డంతో ఆమె నేప‌థ్యంపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ బి. చంద్ర‌క‌ళ‌. గ‌తంలో యూపీ ముఖ్య‌మంత్రిగా అఖిలేష్ యాద‌వ్ ప‌నిచేసినప్పుడు ఆమె యూపీలో క‌లెక్ట‌ర్ ఉన్నారు. అప్ప‌ట్లో ఇసుక అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్టు ఒక కేస్ న‌మోదైంది. అందులో చంద్ర‌క‌ళ పేరు కూడా ఉండటంతో సీబీఐ నిన్న ఆమె ఆస్తుల‌పై సోదాలు జ‌రిపింది.

చంద్ర‌క‌ళ‌ది క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని ఎల్లారెడ్డి మండ‌లంలో గ‌ల గ‌ర్జ‌న‌ప‌ల్లి గ్రామం. కేంద్రీయ విద్యాల‌య‌లో చ‌దువుకున్నారు. త‌ర్వాత హైద‌రాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి దూర‌విద్య‌లో ఎంఏ ఎక‌నామిక్స్ పూర్తి చేశారు. చంద్ర‌క‌ళ తండ్రి కిష‌న్‌, త‌ల్లి ల‌క్ష్మీ. తండ్రి రామ‌గుండంలో ఎఫ్‌సీఐలో ప‌నిచేశారు.

చంద్ర‌క‌ళ సోష‌ల్ మీడియాలా చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న వీడియోల‌ను పోస్టు చేస్తూ ప్రాచుర్యంలో ఉంటారు. అంతేకాదు… అనేక కీల‌క‌మైన కేసుల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆఫీస‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం సీబీఐ దాడుల‌ను కూడా రాజ‌కీయంలో భాగంగానే చూడొచ్చు.

త‌మ‌కు రాజ‌కీయ వ్య‌తిరేకుల‌ను సీబీఐ, ఐటీ దాడుల‌తో భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం బీజేపీ విధానంలో భాగం. అఖిలేష్ యాద‌వ్‌, మాయావ‌తి కూట‌మి యూపీలో బ‌లంగా మార‌డంతో బీజేపీ అఖిలేష్‌పై గురిపెట్టింది. దీనికి సీబీఐని వాడుకుంటోంది. అందులో భాగంగానే పాత కేసుల‌ను తవ్వి తీస్తుంది. చంద్ర‌క‌ళ‌పై దాడులు కూడా ఇందులో భాగ‌మే.