మోదీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టేనా…?

కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ల‌క్ష్యంగా 2014లో ప్రారంభించిన బీజేపీ గెలుపుయాత్ర‌కు 2018లో చాలా బ్రేకులు ప‌డ్డాయి. ల‌క్ష్యం కాంగ్రెసే అయిన‌ప్ప‌టికీ, లోలోప‌ల ప్రాంతీయ పార్టీల ప‌ట్ల కూడా బీజేపీకి చిన్న‌చూపే ఉంది. దాదాపు 300 సీట్ల‌తో బీజేపీకి 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డంతో ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోయినా ఎన్డీఏ పేరుతోనే ప్ర‌భుత్వం న‌డుపుతోంది. కానీ భాగ‌స్వామ్య ప‌క్షాల ప‌ట్ల బీజేపీ వైఖ‌రి మొద‌టి నుంచీ తేడాగానే ఉంది. వాళ్లుకూడా స‌మ‌యం కోసం చూశారు త‌ప్ప‌, బీజేపీ లొంగిపోయి ప్ర‌భుత్వంలో కొన‌సాగ‌డం లేదు.

యూపీ ఉప ఎన్నిక‌ల్లో భారీ ఓట‌ములు, తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో అధికారం కోల్పోవ‌డం, టీడీపీ, శివ‌సేన‌, బిహార్‌లో కుష్వాహా దూర‌మ‌వ‌డం, కాశ్మీర్‌లో పీడీపీ దూర‌మ‌వ‌డం, క‌ర్ణాట‌క‌లో మెజారిటీ లేక‌పోయినా ప్ర‌భుత్వం ఏర్పాటుచేసి న‌వ్వుల‌పాలు కావ‌డం… ఇవన్నీ బీజేపీకి గ‌ట్టిదెబ్బ‌లే. దీంతో మోదీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది.

తాజాగా ఓ జాతీయ వార్తాసంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంకీర్ణ ప్ర‌భుత్వాలు, భాగ‌స్వామ్య ప‌క్షాల గురించి మోదీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీ మారిన ఆలోచ‌న ధోర‌ణిని సూచిస్తున్నాయి. బీజేపీతోపాటు భాగ‌స్వామ్య ప‌క్షాలు కూడా ఎద‌గాల‌నేది మా కోరిక‌ని మోదీ చెప్పారు. భాగ‌స్వామ్య ప‌క్షాలను బ‌లిచేసి మేము ఎద‌గాల‌నుకోవ‌డం లేద‌ని చెప్పారు. భార‌త‌దేశంలో ఏక లేదా ద్వంద్వ పార్టీ వ్య‌వ‌స్థ‌కు ఎప్పుడో కాలం చెల్లింద‌న్న విష‌యం బీజేపీకి ఇప్ప‌టికి అర్థ‌మైనట్టు క‌నిపిస్తుంది.

కానీ ఇప్ప‌టికే ప‌రిస్థితి చేజారిపోయిన‌ట్టు కనిపిస్తుంది. ఏ ప్రాంతీయ‌ పార్టీ కూడా బీజేపీని న‌మ్మో స్థితిలో క‌నిపించ‌డం లేదు. 2019లో ఒక‌వేళ బీజేపీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం… ప్రాంతీయ పార్టీల‌ను శ‌త్రువులుగా మార్చుకోవ‌డ‌మే. మోదీ తాజా వ్యాఖ్య‌ల వ‌ల్ల బీజేపీలో కొంత అంత‌ర్మ‌థ‌నం ఉన్న‌ట్టు క‌నిపించినా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఏ మేర‌కు న‌మ్ముతాయ‌నేది చూడాలి.