కేసీఆర్ రైతుబంధు కాపీ ప‌థ‌క‌మే

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపుతో కేసీఆర్ ప‌థ‌కాలు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ విజ‌యంలో రైతుబంధు కీల‌క‌మ‌నీ, ఇలాంటి ప‌థ‌కాన్ని దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా అనేక మంది విశ్లేషించారు. కానీ రైతుబంధు ప‌థ‌కం కేసీఆర్ సొంత ఆలోచ‌న కాద‌నేది తాజా విశ్లేష‌ణ‌. దీనికి మూలాలు వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌డ్డాయని ఇప్పుడు చ‌ర్చించుకుంటున్నారు. కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల‌కు కూడా వై.ఎస్‌.ఆర్‌. ప‌థ‌కం ఆలోచ‌న గుర్తున్న‌ట్టు లేదు.

ప‌దేళ్ల కింద‌టే రైతు బంధు ప‌థ‌కం మూలాలు ఉన్నాయి. 2008లో అప్ప‌టి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి రైతుల‌కు ఏటా రూ.5000 క్యాష్ రూపంలో ఇవ్వాలని ప్ర‌తిపాదించారు. రుణ‌మాఫీ బ‌దులు దేశవ్యాప్తంగా దీన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌తిపాదించారు. అయితే అప్ప‌టి కాంగ్రెస్ అధిష్టానం దీన్ని అంగీక‌రించ‌లేదు. రుణ మాఫీ కంటే ఎక్కువ వ్య‌యం అవుతుంద‌నే భావ‌న‌తో దీన్ని ప‌క్క‌న‌పెట్టారు. దీంతో 2009 ఎన్నిక‌ల్లో రుణ‌మాఫీ వాగ్గానంతోనే గెలిచారు. ఇదే ఆలోచ‌న‌న‌ను ఇప్పుడు వెర్ష‌న్ 2.0 రూపంలో కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కంగా మార్చారు.

YSR and KCR

అంతేకాదు… ప‌థ‌కాలకు బ‌దులు నేరుగా రైతుల‌కు డ‌బ్బులు ఇవ్వాల‌నే ఆలోచ‌న అప్ప‌ట్లో టీడీపీ మ్యానిఫెస్టోలో కూడా ఉంది. రూ.2000 న‌గదు బ‌దిలీ ప‌థ‌కం ఇదే. అయితే టీడీపీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఈ ప‌థ‌కం అమ‌లు కాలేదు. అమ‌లు కాలేదు కాబ‌ట్టి ఆలోచ‌న‌ను కొట్టిపారేయ‌లేం. ఎందుకంటే హైటెక్ సిటీ క్రెడిట్ ఎన్‌. జ‌నార్థ‌న‌రెడ్డికి ఇచ్చిన‌ప్పుడు రైతుబంధు క్రెడిట్ వై.ఎస్‌.ఆర్‌.కి ఇవ్వాలి క‌దా.

హైటెక్ సిటీకి పునాదిరాయి వేసింది కాంగ్రెస్ కు చెందిన నేదురుమ‌ల్లి జ‌నార్థ‌న్‌రెడ్డి అని, రాజీవ్‌గాంధీ హ‌యాంలో ఇది జ‌రిగింద‌నీ, చంద్ర‌బాబు నాయుడు డ‌బ్బా కొట్టుడు ఇంక ఆపాల‌ని ఇటీవ‌ల కేసీఆర్ విమ‌ర్శించారు. అలాగే రింగురోడ్డు కూడా వై.ఎస్‌.ఆర్‌. క‌ట్టాడ‌ని చెప్పారు. మ‌రి దీనికి పునాది వేసింది ఎవ‌రు? అస‌లు ఏ ప‌థ‌క‌మైనా క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కాలి? ఆలోచించిన వారికా, పునాది వేసిన‌వారికా? ఆచ‌ర‌ణ‌లో అమలు చేసిన‌వారికా? లేక‌పోతే వీళ్లంద‌రికా? రైతుబంధు కాపీ గురించి కేసీఆర్ ఏమంటారు?