ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగానే ఏపీలో కూడా రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను నోటిఫికేషన్ కంటే ముందుగా ప్రకటించాలని కసరత్తు చేస్తున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారం అంతా ముగించుకొని ప్రచారంపై దృష్టి పెట్టాలని టీడీపీ, వైసీపీ పార్టీలు భావిస్తున్నాయి.
టీడీపీ ఇప్పటికే జాబితా రూపకల్పనలో మునిగితేలుతోంది. రకరకాల సర్వేల ద్వారా సిట్టింగ్ అభ్యర్థుల పనితీరును మదింపు చేస్తోంది. చాలామంది అభ్యర్థులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో ఆయా స్థానాల్లో టీడీపీ ఆశావహులు సీట్ల విషయంలో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి వారిని పార్టీ విడిచి పోకుండా ఉండేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. వారికి మళ్లీ అధికారంలోకి వస్తే పదవుల హామీలు ఇస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర త్వరలో ముగియనుంది. తర్వాత అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయి కసరత్తు మొదలుపెట్టనున్నారు. తెలుగుదేశం జాబితా తర్వాత విడుదల చేస్తే అక్కడి అసంతృప్తులు ఇక్కడకు రావడం, మళ్లీ ఇక్కడి నాయకుల్లో విభేదాలు రావడం వంటివి ఉంటాయి. అందువల్ల టీడీపీ జాబితాతో సంబంధం లేకుండా తమ అభ్యర్థులను కూడా ఎంపిక చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
రెండు పార్టీలు సంక్రాంతి తర్వాత వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని చూస్తున్నాయి. టీడీపీ కనీసం 70-80 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ పొత్తుల విషయం ఇంకా ఫైనలైజ్ కాకపోవడంతో కొంచెం ఆచితూచి జాబితా విడుదల చేయవచ్చు. వైసీపీ కూడా అంతే సంఖ్యలో, లేదా 100 స్థానాలకైనా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తోంది. వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.