తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా హ‌రీష్‌రావు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ భారీ విజ‌యం ఆ పార్టీ రాజ‌కీయాల్లో కూడా అనూహ్య మార్పుల‌కు దారితీయ‌బోతుందా? కేటీఆర్‌ను కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌డం ఈ దిశ‌గా అత్యంత కీల‌క‌మైన‌, సంచ‌ల‌న నిర్ణ‌యం. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డం దాదాపు ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి కేసీఆర్ దీనిపై నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

దీంతోపాటు టీఆర్ఎస్‌లో అండ‌ర్ క‌రెంట్‌గా న‌డుస్తోన్న వ్య‌వ‌హారం… హ‌రీష్‌రావు ప్రాధాన్యం త‌గ్గించ‌డం. కేసీఆర్ క్రియాశీలకంగా ఉన్న‌న్నాళ్లు ఆయ‌నే పార్టీలో నెంబ‌ర్ 1 కాబ‌ట్టి త‌ర్వాత స్థానాల గురించి ఎవ‌రూ ఆలోచించే సాహసం చేయ‌లేదు. కానీ కేసీఆర్ స్థానంలోకి కేటీఆర్ వ‌స్తుండ‌టంతో స‌హ‌జంగానే సీనియ‌ర్‌, జూనియ‌ర్ లాంటి విభేదాలు వ‌స్తాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి బ‌య‌ట‌కు పొక్క‌క‌పోయినా లోలోప‌ల ఇలాంటి స్ఫ‌ర్ద‌లు ఉంటాయి.

Harish as speaker

హ‌రీష్‌రావు ప‌రిస్థితి కూడా ఇలాగే ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల స‌మీక్ష‌కు పిల‌వ‌క‌పోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి టీఆర్ఎస్ విజ‌యోత్స‌వాల పేరుతో నిర్వ‌హిస్తున్న‌ కేటీఆర్ ప్ర‌చార స‌భ‌ల‌లోనూ ఎక్క‌డా హ‌రీష్‌రావు జాడ లేదు. తాజాగా అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వికి హ‌రీష్‌రావు పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం.

ఎవ‌రూ స్పీక‌ర్ ప‌ద‌వి తీసుకోవ‌డానికి ముందుకు రాక‌పోవ‌డంతో హ‌రీష్‌రావుకు బ‌ల‌వంతంగా దీన్ని అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. అదీగాక తాజా స్పీక‌ర్ మ‌దుసూధ‌నాచారి ద‌గ్గ‌ర్నుంచి, అంతకుముందు స్పీక‌ర్లుగా చేసిన‌వారెవ‌రూ మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేదు. ఈ సెంటిమెంట్ వ‌ల్ల ఎమ్మెల్యేలు ఎవ‌రూ ముందుకురావ‌డం లేదు. హ‌రీష్‌రావు ఎలాగూ కేసీఆర్ మాట జ‌వ‌దాటే ప‌రిస్థితి లేదు. త‌ద్వారా పార్టీలో హ‌రీష్‌రావు మ‌రింత సైడ్‌లైన్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.