ఆవు సంక్షేమ ప‌న్ను.. గోవుల్నివీధుల్లో వ‌దిలేస్తే జ‌రిమానా

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని చూశాం. బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముందుగా హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఇత‌ర ప‌ట్ట‌ణాల పేర్ల‌ను మార్చేస్తామ‌ని హామీ ఇచ్చారు. పాపం… ఏం పేర్లు పెడ‌తారో, వాటిని ప‌ల‌క‌డం వ‌స్త‌దో రాదో అని జ‌నాలు ద‌డుచుకున్న‌ట్టుంది.. ఒక సీటుతో స‌రిపెట్టేశారు. యూపీలో యోగి అధికారం కాబ‌ట్టి, అక్క‌డ వారి అభిమాన‌ బంధుగ‌ణం ఎక్కువ కాబ‌ట్టి అల‌హాబాద్ పేరు మార్చుకున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం కూడా యోగి తీసుకున్నారు.

యూపీలో గోవుల సంక్షేమం కోసం ప్ర‌జ‌ల‌పై ప‌న్ను విధించారు. గో క‌ళ్యాణ్ సెస్ పేరుతో జీఎస్‌టీ, స‌ర్వీస్ ట్యాక్స్ మాదిరిగా ప్ర‌త్యేకంగా ప‌న్ను విధిస్తారు. ఇలా వ‌చ్చిన నిధుల‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గోవుల సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఇది అద్భుత‌మైన నిర్ణ‌యమే. నోరులేని మూగ‌జీవాల‌ను, అదీగాక హిందువులు ప‌విత్రంగా పూజించే వాటిని సంర‌క్షించ‌డంలో త‌ప్పుప‌ట్టాల్సింది ఏముంటుంది?

yogi tax for cow welfare

కానీ మిగ‌తా విష‌యాల సంగతేంటి సారూ. మాన‌వాభివృద్ధిలో యూపీ క‌డుపేద దేశాలైన మ‌ధ్య ఆఫ్రికా, ఎరిత్రియా లాంటి వాటితో స‌మానంగా ఉంద‌ని యునైటెడ్ నేష‌న్స్ హ్యూమ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ రిపోర్ట్ ఈ మ‌ధ్యే చెప్పింది. ఈ మ‌ధ్య వ‌ర‌కు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న మ‌ధ్య ప్ర‌దేశ్ కూడా ఇదే స్థితిలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల‌ను గ‌న‌క ప్ర‌త్యేక దేశాలుగా ప‌రిగ‌ణిస్తే ప్ర‌పంచంలోని అతి త‌క్కువ మాన‌వాభివృద్ధి ఉండే 20 దేశాల్లో ఇవీ ఉండేవ‌ని యునైటెడ్ నేష‌న్స్ పేర్కొంది. ఇదీ ప‌రిస్థితి.

అందుకే ఏదో ఒక సెస్ పెట్టి, లేదా మ‌ఠాలలోని హుండీల నుంచి వచ్చే ఆదాయాన్ని కొంత యూపీలోని పిల్ల‌ల చ‌దువుల కోసం, మ‌హిళ‌లు… ముఖ్యంగా బాలింత‌ల సంర‌క్ష‌ణ కోసం, మంచి ఇల్లు, బ‌ట్ట‌ల‌తో గౌర‌వ ప్ర‌దంగా బ‌త‌కడం కోసం ఖ‌ర్చుపెట్టండి. గోవుల‌ను వీధుల్లో విడిచిన‌వారిని అరెస్టు చేసినట్టే, గో సంర‌క్ష‌ణ్ పేరుతో హింస‌కు దిగేవారిని, పిల్ల‌ల‌ను బ‌డికి పంపించ‌నివారిని అరెస్టు చేయండి. అంద‌రూ గో మాత‌ల‌తోపాటు మీ ఫొటోల‌ను కూడా ఇళ్ల‌లో పెట్టుకుంటారు.