తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్, క్లాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జతకట్టి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడంలో కీలకపాత్ర పోషించారు. అప్పటికి తన పార్టీ జనసేన పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విభజన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే మంచిదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు తర్వాత ఆయనే చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇక సొంతగా పార్టీ పెట్టి, దాన్ని క్రియాశీలం చేయడంతో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారారు. అప్పటి నుంచి యాక్టివ్‌గా ప్రచారం చేస్తున్నారు. కొన్నాళ్లు టీడీపీ ప్రభుత్వం పట్ల సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ తర్వాత రోజుల్లో విమర్శించడం మొదలుపెట్టారు. కాస్త ఆగి వైసీపీ అధినేత జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
అయితే తాజా పరిణామాలు జనసేన రాజకీయాలను మళ్లీ చర్చనీయాంశంగా మార్చాయి. 2019 ఎన్నికల్లో చక్రం తిప్పాలంటే స్వతంత్రంగా పోటీచేయడమా, లేదా ఏదైనా పొత్తు అవసరమా అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిగా నిర్ణయానికి వచ్చినట్టు లేరు. గత కొంతకాలంగా టీడీపీ పట్ల మెతక వైఖరి అలంబిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విదేశీ పర్యటనల తర్వాత విజయవాడలో ఎన్నికల శంఖారావం పూరించినా అందులో టీడీపీపై విమర్శలు లేవు.
అదే సమయంలో తెలంగాణలో ఓడిపోయినందువల్లే చంద్రబాబుకు నాపై ఆక్రోశం అన్న మోదీ వ్యాఖ్యలకు సమాధానమిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన కలుస్తాయన్న వాదనకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. జనసేనతో కలిస్తే తప్పేంటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో గతంలో మాదిరిగా మోదీ టీమ్‌లో పవన్ కళ్యాణ్‌ను కలపలేదు.
ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సానుకూల సంకేతాలు పంపిస్తే కారణం ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ప్రజారాజ్యం ప్రయోగాన్ని గుర్తుంచుకొని ఏవో కొన్ని సీట్లకే పరిమితమైతే ఉపయోగం ఏంటన్న ఆలోచన వచ్చిందా? ప్రతిపక్షం వైసీపీ బలంగా కనిపిస్తున్నందువల్ల జనసేన ఒక్కటే పోటీచేసి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే లేవు. దీనికి బదులు తెలుగుదేశంతో సీట్లు, తర్వాత అధికారం పంచుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారా? ఎన్నికలు సమీపిస్తున్నందున ఇంకొన్ని రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.