ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నాయకులు పూర్తిగా ఆచరణాత్మక దృక్పథంలో ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీడీపీ, జనసేనల మధ్య చిగురిస్తున్న పొత్తు చర్చనీయాంశంగా మారింది.
ఇది నిజమే అన్నట్టుగా గత కొంతకాలంగా టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై పవన్ కళ్యాణ్ పెద్దగా విమర్శలు సంధించడం లేదు. తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కువగా జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొదట్లో చంద్రబాబు, చినబాబు (లోకేష్)లపై విరుచుకుపడ్డారు. ఏపీలో పనులు జరగాలంటే చినబాబుకు కమీషన్లు ఇవ్వాలని విమర్శించారు.
మరోవైపు వైసీపీ అధినేత జగన్‌పై కూడా వ్యక్తిగత స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు ఉన్నాయి. జగన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఘాటుగా విమర్శించారు. దీంతో వీరిద్దరి మధ్య పొత్తు అసంభవంగా మారింది. ఇక ఒంటరిగా వెళ్తే అధికారం రాదన్న ఆలోచన పవన్ కళ్యాణ్‌కి లేదని భావించలేము. గోదావరి జిల్లాలు, కృష్టాలో తప్ప పవన్ కళ్యాణ్ ప్రభావం ఇతర జిల్లాల్లో పెద్దగా ఉండకపోవచ్చు. ఈ రియలైజేషన్ వల్ల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు మరలే అవకాశం లేకపోలేదు.
ఇక తెలుగుదేశానికి కూడా వైసీపీ గట్టిపోటీ ఇస్తుండటంతో పొత్తులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక బలమైన పార్టీతో జతకడితే తప్ప వైసీపీని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఇందులో భాగంగానే జనసేనను దగ్గరికి తీసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకే తాజాగా మోదీ – జగన్ గ్రూప్ నుంచి పవన్ కళ్యాణ్ ను తీసేసి కేసీఆర్ ను చేర్చారు. దీంతో అటు పవన్ టీడీపికి దగ్గరవడంతోపాటు, కేసీఆర్‌తో దోస్తీ వల్ల జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఈ సమీకరణాలు ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే.