బెజ‌వాడ లాయ‌ర్లు బెంచ్ అడిగితే ఏకంగా హైకోర్టే వ‌చ్చింది

రాష్ట్ర విభ‌జ‌న తర్వాత ఏపీలో మ‌రో చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేకంగా హైకోర్టు ఏర్పాట‌యింది. హైకోర్టు తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (తాత్కాలిక‌) జ‌స్టిస్ సి. ప్ర‌వీణ్‌కుమార్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆయ‌న‌తో ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త న్యాయ‌స్థానం పూర్తి స్థాయిలో ప‌నులు ప్రారంభించ‌నుంది.

AP new high court chief justice

నిజానికి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌ర‌గ‌క ముందు ఎప్ప‌టినుంచో హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కోసం డిమాండ్ ఉంది. హైద‌రాబాద్‌లో హైకోర్టు ఉన్నందువ‌ల్ల త‌మ‌కు కేసుల‌కు హాజ‌రుకావ‌డం విష‌యంలో ఇబ్బందిగా ఉంద‌ని, విజ‌య‌వాడ‌లో డివిజ‌న్ బెంచ్ పెట్టాల‌ని చాలాకాలం నుంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏకంగా అమ‌రావ‌తిలో హైకోర్టే రావ‌డంతో విజ‌య‌వాడ న్యాయ‌వాదుల్లో ఆనందం నెల‌కొంది.

అయితే హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన న్యాయ‌వాదులు మాత్రం కొంత నిరాశ‌తో ఉన్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తికి త‌ర‌లి వెళ్లిన‌ప్ప‌టికీ పిల్ల‌ల చ‌దువులు, సొంత ఇల్లు, ఆస్తులు హైద‌రాబాద్‌లో ఉండ‌టం వ‌ల్ల ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండ‌నే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు ఉద్యోగులు చాలా సుహృద్భావంతో ఏపీ హైకోర్టు ఉద్యోగుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో ఏపీ ఉద్యోగులు సంతోషంగా త‌ర‌లివెళ్లారు.

జ‌న‌వ‌రి 1 నుంచి ఏపీలో హైకోర్టు కార్య‌క‌లాపాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి హైకోర్టులో 3.4లక్షల కేసులు ఉన్నాయి. వీటిలో 70 శాతం కేసులు ఏపీకి సంబంధించిన‌వే కావ‌డం విశేషం. దీంతో తెలంగాణ హైకోర్టులో కేసులు త్వ‌ర‌గా ప‌రిష్కారం కావ‌చ్చు.