తక్కువ కాలంలో స్టార్డమ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. కథల ఎంపికలో తన జాగ్రత్తో, లక్కో… ఏదేమైనా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం… ఇలా వరుస హిట్లతో అమ్మాయిలు, అబ్బాయిల్లో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యువ ప్రేక్షకుల నాడి పట్టుకోవడంతో వరుస హిట్లు కొట్టాడు. అయితే ఇటీవల కాలంలో విజయ్ సినిమాల ఎంపికలో కొంచెం తడబాటు కనిపిస్తుంది.
నోటా సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం విజయ్ దేవరకొండ కెరీర్‌ను కొంత డిస్టర్బ్ చేసినట్టుంది. తన పాత్రల్లో వైవిధ్యం ఉంటే మంచిదే. నటుడిగా ఎదగడానికి అది చాలా అవసరం కూడా. కానీ తన ఇమేజ్‌కు, వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవడం కూడా తప్పనిసరి. ఈ వయసులో సందేశాత్మక చిత్రాల్లో విజయ్ దేవరకొండను ఎవరూ ఊహించుకోలేరు. అందుకే నోటా ఫలితం అలా వచ్చింది.
ఇప్పడు నటిస్తున్న డియర్ కామ్రేడ్ కూడా కథ పరంగా విజయ్ ఇమేజ్‌కు సరిపోతుందా లేదా అనేది సందేహమే. మళయాళంలో హిట్ అయిన కామ్రేడ్ ఇన్ అమెరికా సినిమాను తెలుగులో తీస్తున్నారు. ఇందులో హీలో వామపక్ష భావజాలం ఉన్న కార్యకర్త పాత్ర పోషిస్తాడని సమాచారం. సినిమా వివరాలు ఏమీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సినిమా పోస్టర్, టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే కొంచెం సీరియస్ సినిమాలాగే ఉంది. కానీ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని సినిమా బృందం అంటోంది. హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ జోడీ డియర్ కామ్రేడ్లో మళ్లీ కనిపించబోతుంది. రష్మిక ఇందులో క్రికెటర్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం బయటకు వచ్చింది.