ఎన్టీఆర్ బయోపిక్… ఎన్టీఆర్ – కథానాయకుడు శరవేగంగా తయారవుతోంది. ఇప్పటికే ఆడియో, టీజర్‌లతోపాటు అప్పుడప్పుడు సినిమాలో బాలకృష్ణ పోషించిన గెటప్‌లను రిలీజ్ చేస్తూ ఈ సినిమా అంచనాలు పెంచుతున్నారు. తాజాగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు పోస్టర్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఎన్టీఆర్ వేసిన గెటప్‌లలో అల్లూరి గెటప్ సూపర్ హిట్. ఇప్పుడు అదే పాత్రలో బాలకృష్ణను చూడటం నందమూరి అభిమానులకు పండగలా ఉంది.
జనవరి 9 ఎన్టీఆర్ – కథనాయకుడు విడుదల కానుంది. సినిమా విడుదల కాకముందే బిజినెస్ బాగా చేసినట్టు టాక్. అమెజాన్ ప్రైమ్ రూ.25 కోట్లకు తెలుగు వెర్షన్ హక్కులు కొన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు, నందమూరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో అగ్రతారలు చాలామంది నటిస్తున్నారు. బాలకృష్ణ తన తండ్రి పాత్రలో, విద్యాబాలన్ బసవతారకం పాత్రలో, అక్కినేనిగా సుమంత్, సావిత్రిగా నిత్యమీనన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, తదితరులు నటిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా కెరీర్‌లో సూపర్ హిట్ అయిన అనేక పాటలు, పాత్రలు, డైలాగ్‌లు ఇందులో కనివిందు చేయనున్నాయి.