బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో విమర్శించడం ఎవరూ చూసి ఉండరు. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, ఎదురుదెబ్బలు తిని, దీర్ఘకాలం శత్రువులుగా బతికిన వారు కూడా ఒకరిని మరొకరు ఈ స్థాయిలో దూషించరు. ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చు. అవినీతిని ఎండగట్టవచ్చు. కానీ నిన్న గంటకు పైగా సాగిన ప్రెస్ మీట్లో చంద్రబాబును తిట్టడానికే దాదాపు గంట సమయం కేసీఆర్ కేటాయించడం దిగజారిన రాజకీయాలకు నిదర్శనం.
ఏపీలో కేసీఆరే ప్రతిపక్షం
వాస్తవానికి ఏపీ రాజకీయాలను పరిశీలించినవారికి అక్కడ ప్రతిపక్షం క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించదు. ఒకరిని ఒకరు వ్యక్తిగత దూషనలు, శాపనార్థాలు తప్ప ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా విమర్శించేవారే కరవయ్యారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వపాలనలో లోపాలు ఎన్నో ఉంటాయి. వాటిని బయటకు తీసి తూర్పారబట్టే ప్రతిపక్షం లేదు ఏపీలో. కేసీఆర్ కూడా ఇదే విషయం ప్రస్తావించారు. ఏపీలో ప్రతిపక్షం మాట్లడటం లేదనీ, అందుకే తాను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు.
కేసీఆర్ రాజకీయ వ్యూహం మరోసారి బయటపడింది. ఎన్నికలకు ముందు సీమాంధ్ర ప్రజల పట్ల కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం, ఓపిక ఎన్నికలవగానే మాయమైపోయింది. చంద్రబాబునాయుడుకి నీతి లేదనడం వరకు ఓకే. అవినీతి ఉంటే విమర్శించవచ్చు. కానీ చంద్రబాబుకు జాతి లేదనడం ఏపాటి విమర్శ. బాధ్యతాయుత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి జాతి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలాంటి రాజకీయ పరిణతి? బహుశా బీజేపీతో సాంగత్యం వల్ల ఇలాంటి ఆలోచన ధోరణి పెంపొంది ఉండవచ్చు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసినంత మాత్రాన ఏదైనా మాట్లాడటానికి లైసెన్స్ ఇచ్చినట్టు భావించడం దురదృష్టకరం.