తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో కాంగ్రెస్ సంగతేమోకానీ, టీడీపీ పని అయితే ఇక అయిపోయినట్టేనని చాలామంది భావిస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గడం, ఒకప్పడు అధికారంలో ఉన్న పార్టీ కేవలం 12 స్థానాల్లోనే పోటీ చేయడం, పోటీ చేసిన స్థానాల్లో కేవలం రెంటిలో మాత్రమే గెలవడం… ఇవన్నీ టీడీపీ అస్థిత్వాన్ని ప్రశ్నించే అంశాలే. అయితే దీనితోపాటు అందరూ మర్చిపోయిన అంశం… తెలంగాణలో టీడీపీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఏం చేసిందనేది?
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో తెలంగాణ టీడీపీ చేసిందేమీ లేదు. ఎన్నికల సమయంలో టీవీల ముందు మాట్లాడటం తప్ప గ్రాస్‌రూట్స్ స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు లేవు. టీడీపీ ఆంధ్ర పార్టీ అనే ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహం టీడీపీ దగ్గర లేదు. బీజేపీ, కాంగ్రెస్ కూడా తెలంగాణ పార్టీలు కాదు. టీడీపీ పట్ల తెలంగాణ ప్రజల వ్యతిరేకత అది ఆంధ్రా పార్టీ అని కాదు. అదే నిజమైతే ఖమ్మంలో కూడా ఓడిపోయి ఉండాల్సింది కదా. అదే సమయంలో ప్రాంతం కంటే సామాజిక వర్గం ముఖ్యమనుకుంటే హైదరాబాద్‌లో కూడా గెలవాల్సింది కదా. అందువల్ల టీడీపీ ఓటమికి ప్రాంతం, సామాజిక వర్గం రెండూ పూర్తి కారణాలు కాదు.
ప్రజా సమస్యలపై పోరాడితే ఏ ప్రాంతం పార్టీ అనేది ప్రజలకు పెద్దగా అవసరం లేదు. టీడీపీ గత నాలుగేళ్లలో అలా పోరాడిన సందర్భాలు ఎవరికైనా గుర్తున్నాయా? ప్రజల్లోకి వెళ్లలేకపోయిన టీడీపీ, ఎన్నికల నాటికి తనకు తానే ఒక అప్రధాన పాత్రలోకి వెళ్లిపోయింది. అధికారంలో ఉంటే మాత్రమే ఏదైనా పార్టీకి మనుగడ ఉంటుందని భావిస్తే… పదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేది కాదు. ఎన్నికల్లో విజయమే పార్టీల మనుగడకు గీటురాయి అయితే కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడో అంతరించేవి. వాళ్ల భావజాలం కూడా భారతదేశానికి కాదు.
పొత్తులతోనే ఎన్నికల్లో గెలుస్తామనుకుంటే 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయేది కాదు. దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ తెలంగాణలో మనుగడ సాగించాలంటే ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిందే తప్ప, ఒక సామాజిక వర్గాన్ని, ప్రాంతాన్ని నమ్ముకుంటే అస్తిత్వానికే మరింత ప్రమాదం. మా తాతలు నేతులు తాగారు లాంటి డైలాగులు కూడా వదిలేయాలి. ఎలాగైనా అధికార పక్షాన్ని దించాలని సీట్లు త్యాగం చేయడానికి బదులు ప్రజా సమస్యలపై పోరాటానికి సమయం త్యాగం చేయడం ముఖ్యమని గుర్తించాలి. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం ద్వారా మనుగడ సాధ్యం కాదని టీడీపీ గుర్తిస్తేనే తెలంగాణలో తన అస్థిత్వాన్ని కాపాడుకోగలుగుతుంది.