ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌

దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్ర‌స్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ ఎస్ పార్టీకి ఒక మంచి ఆఫీస్ ఢిల్లీలో నిర్మించాల‌ని త‌ల‌పెట్టారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో దీనిపై చ‌క‌చ‌కా అడుగులు ప‌డుతున్నాయి. రెండు మూడు నెల‌లో ఢిల్లీ టీఆర్ ఎస్ ఆఫీసులో గులాబీ జెండా ఎగ‌ర‌నుంది.

విధానాల ప్రకారం కేంద్ర ప్ర‌భుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం కోసం వెయ్యి గ‌జాల స్థ‌లం కేటాయించాలి. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నందువ‌ల్ల దీని కోసం కేసీఆర్ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనే ఉన్న కేసీఆర్ ఈ స్థ‌లాన్ని ఫైన‌లైజ్ చేసుకొని వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈమేర‌కు పార్టీ ఎంపీలు స్థ‌లం వెతుకులాట‌లో ఉన్నార‌ని తెలిసింది.

telangana bhavan

జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని కేసీఆర్ భావిస్తున్న త‌రుణంలో ఢిల్లీలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక పార్టీ ఆఫీస్ ఉండాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ర‌చూ ఢిల్లీ వెళ్లాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ఇది త‌ప్ప‌నిస‌రి. ఏపీ భ‌వ‌న్ ఉన్న‌ప్ప‌టికీ దాని విభ‌జ‌న ఇంకా పూర్తి కాలేదు. దీని గురించి మోదీతో స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ముహూర్తాల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు శంకుస్థాప‌న‌కు కూడా మంచి ముహూర్తం చూసుకొని సంక్రాంతి త‌ర్వాత పునాది రాయి వేయ‌నున్నారు. మొత్తం మీద ఫిబ్ర‌వ‌రి నాటికి ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ రెడీ అయ్యే అవ‌కాశం ఉంది.