బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటించిన వినయ విధేయ రామ ఆడియో రిలీజ్ వేడుకలో అనేక రాజకీయ సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఆడియో ఫంక్షన్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం, ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈ మధ్య పవన్ కళ్యాణ్‌తో రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ తప్పకుండా జోక్యం చేసుకుంటుందని గతంలో కేటీఆర్ చెప్పడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
అయితే టీఆర్ఎస్ ఏపీలో ఎవరికి మద్దతు తెలుపుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఒకవైపు ఏపీలో వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే సూచనలు లేవు. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు టీఆర్ ఎస్ మద్దతు ఇస్తుందా లేక బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి మద్దతిస్తుందా, లేకపోతే చంద్రబాబును ఓడించండి అని పిలుపు ఇచ్చి బయటి నుంచి చూస్తుందా అనేది చూడాలి.
కేసీఆర్ వైజాగ్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. జగన్, కేసీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు కేటీఆర్ – పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కానీ టీఆర్ఎస్ నాయకత్వం సామర్థ్యాన్ని ఈ విషయంలో అభినందించక తప్పదు. తెలంగాణలో బద్దశత్రువులు అయిన మజ్లిస్, బీజేపీని మేనేజ్ చేసినట్టుగా ఏపీలో కూడా జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ టీఆర్ఎస్ మద్దతు పలకవచ్చు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైఖరిని ఆమోదించారు. కానీ ఏపీ ప్రజలు ఏం చేస్తారనేది చూడాలి.