తెలుగు సినిమా రంగంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక స్థానం. ప్రతి సినిమాలోనూ ఒక కొత్త కత్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అంతేకాదు… హీరో ఇంటిపేరు, వంశం పేరు జనాలు మర్చిపోకుండా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటాడు. అన్నిటికి మించి స్టార్ హీరోల అభిమానుల కోసమే సినిమాలు తీసే దర్శకుడు. తాజాగా వినయ విధేయ రామలో ఇదే విషయం మళ్లీ నిరూపించాడు. థియేటర్లకు ఇంటీరియర్స్ మామూలుగానే ఎర్రగా ఉంటాయి. బోయపాటి సినిమాతో తెరమీద ఎరుపు కూడా కలిసి మరింత ఎర్రగా మారనున్నాయి.
వినయ విధేయ రామ సినిమాలో కంకర రాళ్ల మీద హీరో కత్తి ఈడ్చుకుంటూ రావడం ట్రయిలర్‌లో హైలైట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇందులో రామ్ చరణ్ తేజ్ పేరు రామ్. పుష్కలంగా వినయం, విధేయతలు ఉన్న రామ్ కు కోపం వస్తే మాత్రం ఇంటిపేరు కొణిదెల బయటికి వస్తుంది. మెగా, పవర్ స్టార్ ట్యాగ్‌లను విలన్లకు, ప్రేక్షకులకు వినిపిస్తారు. మిగతావాళ్లు ఇక కాసేపు రిలాక్స్ అవొచ్చు.
తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అసలు సిసలు ప్రతీక బోయపాటి అని చెప్పవచ్చు. లెజెండ్, సింహా సినిమాలతో నందమూరి అభిమానులకు బోయపాటి కుటుంబసభ్యుడిగా మారాడు. వంశం డైలాగ్ పవర్ అలాంటిది. ఇక వినయ విధేయ రామతో మెగా అభిమానులకు కూడా తన బంధుత్వం పంచనున్నాడు. కాకపోతే సోషల్ మీడియాలో నాగబాబు, బాలకృష్ణ సెటైర్లు వేసుకోవడమే బాలేదు.