ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. పరిపాలనకు అత్యంత కీలకమైన సెక్రటేరియట్ భవనాలకు ఈరోజు శంకుస్థాపన జరగనుంది. విభజనతో తీవ్రంగా నష్టపోయి, ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ కు సచివాలయం ఒక కీలకమైన చిరునామా అవుతుంది. ఇతర రాజకీయ వ్యూహాలు, విమర్శలు ఎలా ఉన్నా నవ్యాంధ్రప్రదేశ్ కు దీన్ని ఒక చారిత్రక దినంగా చెప్పుకోవచ్చు.
మొత్తం 5 టవర్లలో ప్రపంచంలోనే ఎత్తయిన సెక్రటేరియట్ కాంప్లెక్స్ అమరావతిలో కట్టనున్నారు. సాంకేతికంగా జూన్ 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఏపీ పరిపాలన ఎప్పుడో అమరావతికి తరలింది. ఇక ఇప్పుడు 2024 నాటికి అన్ని హంగులతో హైటెక్ రాజధాని నిర్మాణం పూర్తి కావలసి ఉంది. వివిధ విభాగాల కోసం ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి స్థాయి భవనాల్లోకి మారాల్సి ఉంది.
ప్రపంచంలోనే ఎత్తైన భవనం:
అమరావతి సెక్రటేరియట్ పనుల్లో నాణ్యతను మద్రాస్ ఐఐటీ పర్యవేక్షిస్తుంది. రోజువారీ పనుల ప్రగతిని సమీక్షించనున్నారు. మొత్తం సచివాలయం విస్తీర్ణం 69.8 లక్షల చదరపు అడుగులు. రూ.4890 కోట్లతో దీని నిర్మాణం చేపట్టారు.
అమరావతి సచివాలయానికి ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 41 ఎకరాల విస్తీర్ణలో సెక్రటేరియట్ నిర్మాణం జరగనుంది. ప్రతి టవర్ 212 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీంతోపాటు న్యాయమూర్తులు, మంత్రులు, కార్యదర్శులకు ఉద్దేశించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే పూర్తి కానుంది.